అమెరికా డిస్ట్రిబ్యూటర్లకు గడ్డుకాలం!

Update: 2019-10-10 06:34 GMT
అమెరికా మార్కెట్ టాలీవుడ్ సినిమాలకు భారీ ఆదాయాన్ని సమకూర్చేది.  కొందరు స్టార్ హీరోలకు ఇక్కడ భారీ ఫాలోయింగ్ ఉండడంతో కలెక్షన్ ఫిగర్స్ అన్నీ మిలియన్లలో ఉండేవి.  ఇతర భాషల హీరోలకు మన సినిమాల కలెక్షన్స్ అసూయ కలిగించేవి.  హిందీ సినిమాల కలెక్షన్స్ కూడా తెలుగు సినిమాలతో పోలిస్తే తీసికట్టే. అయితే అలాంటి మార్కెట్ ఇప్పుడు తిరోగమనంలో ఉండడం అందరినీ షాక్ కు గురిచేస్తోంది.

ఈ ఏడాదిలో 'F2'.. మరో రెండు సినిమాలు తప్ప మిగతావన్నీ డిస్ట్రిబ్యూటర్ల జేబులకు చిల్లుపెట్టినవే. కొన్ని భారీ సినిమాలకు వచ్చిన కలెక్షన్స్ థియేటర్ లీజులకు.. డిజిటల్ ఫీజులకు కూడా సరిపోలేదని డిస్ట్రిబ్యూటర్లు మొత్తుకుంటున్నారు. దీంతో కొత్త సినిమాల రైట్స్ గతంలో కంటే తక్కువ రేట్లకే అమ్మాల్సివస్తోంది.  మొదట్లో నిర్మాతలు అంత కావాలి ఇంత కావాలని బెట్టు చేసినా ఫైనల్ గా బేరం విషయంలో మెట్టు దిగిరాక తప్పడంలేదు.  దీని వల్ల కలెక్షన్ టార్గెట్లు తగ్గాయి.  అయినా ఆ తక్కువ టార్గెట్ లు కూడా అందుకోలేక.. బ్రేక్ ఈవెన్  మార్క్ దాటలేక మన సినిమాలు చతికిల పడుతుండడంతో డిస్ట్రిబ్యూటర్లు తలలు పట్టుకుంటున్నారు.

'సైరా' విషయమే తీసుకుంటే నిర్మాతలు ఆశించిన రేట్ అయితే రాలేదు.  తక్కువకే అమ్మాల్సి వచ్చింది.  3.3 మిలియన్ డాలర్స్ బ్రేక్ ఈవెన్ మార్క్ అయితే దాదాపు వన్ మిలియన్ డాలర్స్ నష్టం తప్పదని అంటున్నారు.  సినిమా బాగాలేదంటే.. మిక్స్డ్ టాక్ వచ్చిందంటే జనాలు చూడలేదని సరిపెట్టుకోవచ్చు.  సినిమాకు పాజిటివ్ టాక్.. హిట్ టాక్ అన్ని వచ్చాయి.  పెద్ద సెలబ్రిటీలు కూడా సినిమాను సూపర్ అని మెచ్చుకున్నారు. అయినా బ్రేక్ ఈవెన్ మార్క్ కు దగ్గరగా పోలేక సతమతమవుతూ ఉండడంతో ఇతర ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లలో టెన్షన్ మొదలైంది.  కారణాలు ఏవైనా యూఎస్ మార్కెట్ దెబ్బతిన్న విషయం ఒప్పుకుంటున్నారు.  సంక్రాంతి సినిమాలను భారీ రేట్లకే అమ్ముతారు.  ఆ సినిమాలు బ్రేక్ ఈవెన్ కావాలంటే కనీసం 4 - 5  మిలియన్ డాలర్స్ సాధించాల్సి ఉంటుంది.   ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా మార్కెట్ కు అంత కలెక్షన్ అందించే సత్తా లేదేమోనని చర్చ మొదలైంది.


Tags:    

Similar News