మూవీ రివ్యూ : పడేసావె

Update: 2016-02-27 04:14 GMT
మూవీ రివ్యూ : పడేసావె

నటీనటులు: సత్య కార్తీక్ - నిత్యా శెట్టి - జహీదా శాన్ - నరేష్ - అనితా చౌదరి - విశ్వ - ఆలీ - కృష్ణుడు తదితరులు
సంగీతం: అనూప్ రూబెన్స్
ఛాయాగ్రహణం: కన్నా
మాటలు: కిరణ్
నిర్మాణం: అయాన్ క్రియేషన్స్
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: చునియా

యాన్ అక్కినేని నాగార్జున ఎంకరేజ్మెంట్.. అంటూ ట్యాగ్ వేసుకుని వచ్చిన సినిమా ‘పడేసావె’. మంచి జడ్జిమెంటల్ స్కిల్స్ ఉన్న నాగార్జునకు తెగ నచ్చేసి ఈ సినిమాను ప్రమోట్ చేయడంతో ‘పడేసావె’ మీద జనాల్లో కొంచెం ఆసక్తి మొదలైంది. మరి నాగ్‌ ను అంతగా ఆకట్టుకున్న ఈ సినిమాలో అంత విశేషం ఏముందో చూద్దాం పదండి.

కథ:

కార్తీక్ (సత్య కార్తీక్) చిన్నప్పట్నుంచి చదువులో వీక్. పెద్దయ్యాక కూడా అందరిలాగా ఉద్యోగం ఏమీ చేయక తన టేస్టుకు తగ్గట్లు జంక్ ఐటెమ్స్ తో బొమ్మలు తయారు చేసే ఆర్టిస్టుగా మారే ప్రయత్నంలో ఉంటాడు. కార్తీక్ పక్కింట్లోనే ఉండే నిహారిక (నిత్యా శెట్టి) అతణ్ని ప్రేమిస్తుంది. కానీ కార్తీక్ మాత్రం ఆమెను ఫ్రెండులాగే చూస్తాడు. నిహారిక బెస్ట్ ఫ్రెండ్ అయిన స్వాతి (జహీదా శాన్)తో కార్తీక్ కు పరిచయం ఏర్పడుతుంది. ఆమెను కార్తీక్ ఇష్టపడతాడు. కానీ ఆమె అప్పటికే మరొకరితో ఎంగేజ్ అయి ఉంటుంది. మరి ఈ ముక్కోణపు ప్రేమకథ చివరికి ఏ మలుపు తీసుకుంది? కార్తీక్ చివరికి ఎవర్ని పెళ్లి చేసుకున్నాడు? అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

నాగార్జున అంతగా సినిమాను ప్రమోట్ చేశాడు కదా.. తనకు సినిమా చాలా చాలా నచ్చేసిందని చెప్పాడు కదా.. కాబట్టి ‘పడేసావె’లో ఏదో ఒక ప్రత్యేకత ఉండి ఉంటుందనే అందరూ అనుకున్నారు కానీ.. నాగార్జున పడిపోయినట్లుగా అందరూ పడిపోయేంత స్పెషాలిటీ ఏమీ లేదు ‘పడేసావే’లో. మనం, సోగ్గాడే చిన్నినాయనా లాంటి సినిమాలు తీసిన నాగార్జున.. భాయ్ లాంటి సినిమా కూడా చేశాడన్న వాస్తవం గుర్తుకొస్తుంది ‘పడేసావె’ చూశాక.

ఈ టైపు ముక్కోణపు ప్రేమకథలు తెలుగులో ఎన్ని వచ్చాయో లెక్క లేదు. పోనీ కథనమైనా కొత్తగా ఉందా అంటే అదే కాదు. ఇంతకుముందు మా టీవీలో ‘యువ’ సీరియల్ ల సింపుల్ హ్యూమర్ తో ఆకట్టుకున్న చునియా.. వెండితెర మీద మాత్రం ఆ ప్రతిభ చూపించలేకపోయింది. పాత చింతకాయ పచ్చడి లాంటి కథను ఎంచుకోవడం.. ప్రేక్షకుల అంచనాల్ని దాటిపోని మామూలు కథనంతోనే ఆ కథను నడిపించడం.. కథలో ఏ మలుపులూ లేకపోవడం.. అనుకున్న స్థాయిలో కామెడీ పండించలేకపోవడంతో ‘పడేసావె’ సాదాసీదా సినిమాగా మిగిలిపోయింది. సినిమాలో పెద్ద కథ కూడా లేదు. ఓ ముక్కోణపు ప్రేమకథ అనే లైన్ అనేసుకుని.. దాని చుట్టూ సన్నివేశాలు మాత్రమే పేర్చుకుంటూ పోయారు. ప్రేమకథల్ని సరిగా తీర్చిదిద్దకపోవడం మైనస్ అయింది.

తాను ఫ్రెండుగా భావించే అమ్మాయి తనను లవ్ చేస్తోందని... తాను కూడా ఆమెను లవ్ చేస్తున్నానని అపార్థం చేసుకుందని హీరోకు తెలుస్తుంది. ఐతే ఆ అపార్థాన్ని నేరుగా అతను వెళ్లి తొలగించేయొచ్చు కదా. కానీ అతనేమో.. ఈ అపార్థానికి కారణమైన తన ఫ్రెండునే పంపించి అతడితో క్లారిఫై చేయించాలని చూస్తాడు. కానీ అతనేదో చెబుతుంటే.. ఈమె మాత్రం ఆ మాటలు వినకుండా తన చేతిలో ఉన్న లిటిల్ హార్ట్స్ ప్యాకెట్ మాత్రమే చూస్తుంది. ఎక్కడో దూరంగా ఉన్న హీరో తనను లవ్ చేస్తున్న విషయం చెప్పడానికే ఆ ఫ్రెండు వచ్చాడనుకుని సిగ్గుపడిపోతూ వెళ్లిపోతుంది.

ఈ ఐడియా ఫెయిలయ్యాక హీరోకు ఇంకో కొత్త ఐడియా వస్తుంది. తాను ప్రేమించిన అమ్మాయి చేసుకోబోయే అబ్బాయిని బ్యాడ్ చేసేసి ఆమె పెళ్లి చెడగొట్టేద్దామని. అంతే.. తన ఫ్రెండుకే అమ్మాయి వేషం వేయించి హోటల్ కు పంపిస్తాడు. అది కూడా తేడా కొట్టేస్తుంది. ఇలా వ్యవహారమంతా తమాషాగా మారిపోవడంతో కథలో సీరియస్ నెస్ తగ్గిపోయింది. దీంతో చివర్లో ఎమోషనల్‌ డ్రామా మొదలైనా ప్రేక్షకుల్లో ఎమోషన్ రాదు.

ఈ తరహాలో పదుల సంఖ్యలో ముక్కోణపు కథలు చూసిన తెలుగు ప్రేక్షకులకు.. చివర్లో హీరో ఎవర్ని పెళ్లి చేసుకుంటాడో గెస్ చేయడం అంత కష్టమేమీ కాదు. అక్కడక్కడా కామెడీ సీన్స్ పండటం.. చిన్న సినిమా అయినా ప్రొడక్షన్ వాల్యూస్ బాగుండటం.. అనూప్ రూబెన్స్ మంచి మ్యూజిక్ తో ఎంగేజ్ చేయడం.. ‘పడేసావె’లో చెప్పుకోదగ్గ ప్లస్ పాయింట్స్. ఐతే అదనపు ఆకర్షణలు బాగానే ఉన్నా.. అసలు కథా కథనాల్లోనే లోపాలుండటంతో ‘పడేసావె’ జనాల్ని పడేసే విషయంలో సక్సెస్ కాలేకపోయింది.

నటీనటులు:

సత్య కార్తీక్ నటన గురించి పెద్దగా చెప్పుకోవడానికేం లేదు. కాన్ఫిడెంటుగా డైలాగులు చెప్పడం వరకు బాగానే ఉంది కానీ.. హావభావాల విషయంలోనే ఇబ్బంది పడ్డాడు. ఎక్కువగా ఒకే రకం ఎక్స్ ప్రెషన్లతో లాగించేశాడు. హీరోయిన్లు ఇద్దరికీ కూడా ప్రేక్షకుల్ని మాయలో పడేసేంత అందం లేదు. నటన పర్వాలేదు. నిత్యా శెట్టి డిట్టో స్వాతిని తలపిస్తుంది. ఆమె రూపమే కాదు.. డైలాగ్ డెలివరీ, నటన కూడా స్వాతిని గుర్తు చేస్తాయి. జహీదా శాన్ కొన్ని సన్నివేశాల్లో పర్వాలేదనిపించింది. విశ్వ కామెడీ కొన్నిసార్లు నవ్వించినా.. కొన్నిసార్లు చికాకు పెట్టింది.  ఆలీ, కృష్ణుడు పెద్దగా చేసిందేమీ లేదు. నరేష్ - అనితా చౌదరి హీరో తల్లిదండ్రులుగా బాగా చేశారు.

సాంకేతికవర్గం:

టెక్నికల్ గా ‘పడేసావే’ ఓకే అనిపిస్తుంది. అనూప్ సంగీతం సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతం కూడా ఓకే. ఐతే పాటలు అవసరమైన దానికంటే ఎక్కువయ్యాయి. కన్నా ఛాయాగ్రహణం కూడా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. కిరణ్ రాసిన మాటలు పర్వాలేదు. టీవీ స్థాయిలో మంచి సెన్సాఫ్ హ్యూమర్ చూపించిన చునియా.. సినిమాలో మాత్రం నిరాశ పరిచింది. సోసో కామెడీతో నెట్టుకొచ్చే ప్రయత్నం చేసిందే తప్ప..  కథాకథనాల మీద పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. స్క్రిప్టే వీక్ కావడంతో దర్శకురాలిగా ఆమె ప్రతిభ చూపించే అవకాశం లేకపోయింది.

చివరగా: పడిపోయేంత లేదు..

రేటింగ్- 2/5
Tags:    

Similar News