థియేటర్లలో పార్కింగ్ ఛార్జీల బాదుడుకు ఓకే.. కానీ కండీషన్ ఏమంటే?

Update: 2021-07-21 02:27 GMT
ఎప్పుడెప్పుడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజులు వచ్చేస్తున్నాయి. కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు మరోసారి సినిమా థియేటర్లు.. మల్టీఫ్లెక్సుల్ని బంద్ చేయటం తెలిసిందే. లాక్ డౌన్ ను పూర్తిస్థాయిలో ఎత్తేసి దాదాపు నెలకు పైనే కావటం..సినిమా థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం పచ్చజెండా ఊపినప్పటికీ.. ఓపెన్ కాకపోవటం తెలిసిందే. తెలంగాణ సర్కారు ఓకే చెప్పినా.. ఏపీలో థియేటర్లు ఓపెన్ చేయటానికి సిద్ధంగా లేకపోవటంతో.. ఏపీ కారణంగా తెలంగాణలో థియేటర్లు ఓపెన్ కాని పరిస్థితి.

ఇటీవల కాలంలో ఏపీలో కూడా కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ.. అక్కడ కూడా థియేటర్లు ఓపెన్ చేసుకోవటానికి జగన్ ప్రభుత్వం ఓకే చెప్పేసింది. దీంతో.. థియేటర్లు.. మల్టీఫ్లెక్సులు ఓపెన్ కావటానికి రంగం సిద్ధమవుతోంది. జులై 23 (శుక్రవారం) థియేటర్లు తెలంగాణలో అధికారికంగా ఓపెన్ అవుతున్నా.. వేళ్ల మీద లెక్కబెట్టేలా సింగిల్ థియేటర్లు మాత్రమే ఓపెన్ అవుతున్నాయి. ఈ నెలాఖరు (జులై 30న) అన్ని థియేటర్లు.. మల్టీఫ్లెక్సులు పూర్తిస్థాయిలో ఓపెన్ కానున్నాయన్నది తెలిసిందే.

థియేటర్లను రీఓపెన్ చేసే నాటికి.. సినిమా పరిశ్రమను ఆదుకోవటానికి వీలుగా ప్రభుత్వం కొన్ని నిర్ణయాల్ని ప్రకటించాలన్న డిమాండ్ సినీ వర్గాల నుంచి వినిపిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన కరెంటు బిల్లుల మాఫీతో పాటు.. మరికొన్ని వరాల్ని థియేటర్ యాజమాన్యాలు కోరుకుంటున్నాయి. వాటి విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తామని చెప్పినప్పటికీ.. తాజాగా విడుదలైన ఆదేశాలు చూస్తే మాత్రం.. కేవలం ఒక్క విషయం మీద మాత్రమే నిర్ణయం తీసుకున్నారు.

సింగిల్ థియేటర్ యాజమానులు పార్కింగ్ ఫీజును వసూలు చేసుకునేందుకు ఓకే చెప్పింది. అయితే.. సింగిల్ థియేటర్లు పార్కింగ్ ఫీజు వసూలు చేసుకోవచ్చని.. అయితే మల్టీఫ్లెక్సులు.. మాల్స్.. కమర్షియల్ కాంప్లెక్సుల్లో పార్కింగ్ ఫీజులు మాత్రం వసూలు చేయకూడదని స్పష్టం చేసింది. అక్కడ మాత్రం పాత పద్దతినే ఫాలో కావాలని చెప్పింది.

ఇదంతా చూసినప్పుడు.. సింగిల్ థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేసుకోవచ్చని ప్రేక్షకుడి మీద భారం వేసిన ప్రభుత్వం.. తన వరకు తాను మాత్రం మరే వరాన్ని ప్రకటించకపోవటం గమనార్హం. తన వరకు వచ్చేసరికి ఆచితూచి అన్నట్లు వ్యవహరించిన ప్రభుత్వం.. జనాల మీద బాదేసే విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా.. ఆదేశాల్ని జారీ చేయటం ఏమిటో? పార్కింగ్ ఫీజుకు ఓకే చెప్పే బదులు.. కరెంటు బిల్లుల విషయంలో గతంలో ఇచ్చిన హామీని నెరవేర్చి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 
Tags:    

Similar News