అన్న‌గారు-కృష్ణ గారు..మా రెండు క‌ళ్లు: ప‌రుచూరి

Update: 2017-11-08 01:30 GMT
టాలీవుడ్ దిగ్గ‌జ ర‌చ‌యిత‌లు ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. సీనియ‌ర్ ఎన్టీఆర్ నుంచి జూనియ‌ర్ ఎన్టీఆర్ వ‌ర‌కు దాదాపుగా అంద‌రు హీరోల సినిమాల‌కు వారు డైలాగులు రాశారు. త‌మ ప‌దునైన డైలాగుల‌తో మాస్ ఆడియ‌న్స్ ను ఆకట్టుకోవ‌డంలో ప‌రుచూరివారిది అందెవేసిన చెయ్యి. తమ‌ సుదీర్ఘ సినీ ప్ర‌యాణంలో ఎదురైన అనుభ‌వాలు, మ‌ర‌పురాని జ్ఞాప‌కాల‌ను‘పరుచూరి పలుకులు’కార్య‌క్ర‌మం ద్వారా ప‌రుచూరి గోపాల‌కృష్ణ నెమ‌రువేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. త‌న‌ ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ ని ప‌రుచూరి గోపాల‌కృష్ణ  ప్ర‌తి మంగ‌ళ‌వారం త‌న‌ యూట్యూబ్ చానెల్ లో అప్ లోడ్ చేస్తుంటారు. ఈ వారం ఆయ‌న న‌ట‌శేఖ‌ర, సూప‌ర్ స్టార్ కృష్ణ గురించి అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు. కృష్ణ గారితో తమకున్న అనుబంధాన్ని, తమను ఆయన  ప్రోత్సహించిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. త‌మ సోద‌రుల సినీ జీవితానికి అన్న‌గారు, కృష్ణగారు రెండు క‌ళ్ల‌వంటి వార‌ని ఆయ‌న అన్నారు.

అనురాగ దేవ‌త సినిమా స‌మ‌యంలో విశ్వ‌విఖ్యాత న‌టుడు, నంద‌మూరి తార‌క‌రామారావు త‌మ‌కు ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ అని నామ‌క‌ర‌ణం చేశార‌ని ఓ ఇంట‌ర్వ్యూ సంద‌ర్భంగా ప‌రుచూరి  గోపాలకృష్ణ చెప్పారు. అన్న‌ద‌మ్ములిద్ద‌రూ ఎప్పుడూ క‌లిసుండాల‌నే ఉద్దేశంతోనే ఇద్దరికీ క‌లిపి అన్న‌గారు ఒకే పేరు పెట్టార‌ని ఎన్టీఆర్ తో త‌న‌కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అన్న ఎన్టీఆర్ గారు మాకు పరుచూరి బ్రదర్స్ అని పేరుపెట్టి ఆశీర్వదిస్తే, మాకు చేయూత నిచ్చి ఆశీర్వదించింది కృష్ణ గార‌ని, ఆయన మేలును ఈ జన్మలో మర్చిపోలేమ‌ని గోపాలకృష్ణ  అన్నారు. సూపర్ స్టార్ కృష్ణ గారంటే త‌మ సోద‌రుల‌కు చాలా గౌర‌వ‌మ‌ని గ‌తంలో కూడా చాలాసార్లు చెప్పాన‌ని ప‌రుచూరి అన్నారు. మొద‌ట్లో తాము కృష్ణ గారి సినిమాల‌కు నేరుగా ర‌చ‌యిత‌గా మాట‌లు రాయ‌లేద‌ని చెప్పారు.

కృష్ణ గారు నటించిన ‘పగబట్టిన సింహం’ - ‘బంగారుభూమి’ చిత్రాలకు తాను ఘోస్ట్ రైటర్ గా పనిచేశాన‌ని తెలిపారు. ‘బంగారుభూమి’ లో కృష్ణ - శ్రీదేవి నటించిన ఓ సన్నివేశానికి 1981 న‌వంబ‌రు 30న తాను ఓ  డైలాగ్ రాశాన‌న్నారు. ‘పద్మా, మనిషిని నమ్మితే మన నోట్లో ఇంత మట్టి కొడతాడు. అదే, మట్టిని నమ్మితే మన నోటికి ఇంత ముద్ద పెడుతుంది. ఆ మట్టికి నమస్కారం చేసి కొబ్బరికాయ కొట్టు’ అనే డైలాగ్ కృష్ణ గారిని బాగా ఆక‌ట్టుకుంద‌ని చెప్పారు. షూటింగ్ స్పాట్ లో సీన్ ఇవ్వగానే కృష్ణగారు ఈ డైలాగ్ ఎవరు రాశారని యూనిట్ స‌భ్యుల‌ను ప్రశ్నించార‌ని,  ‘ఉయ్యూరు లెక్చరర్’ అని వారు చెప్పారని గోపాల కృష్ణ అన్నారు. అత‌డు చాలా లోతుగా ఆలోచించి మాట‌లు రాశాడ‌ని, ఇండ‌స్ట్రీలో గొప్ప రైట‌ర్ అవుతాడ‌ని తాను ముందే చెప్పాన‌ని కృష్ణ గారు అన్నార‌ని తెలిపారు. ఆ సినిమా త‌ర్వాత 1982లో కృష్ణ గారు ప‌ది సినిమాలు చేస్తున్నార‌ని, వాటిలో 8 చిత్రాల‌కు  మాటలు రాసే అవకాశాన్ని ఆ మహానుభావుడు త‌మ‌కు కల్పించాడని ప‌రుచూరి అన్నారు. కృష్ణగారికి ఆజ‌న్మాంతం రుణ‌ప‌డి ఉంటామ‌న్నారు. `మ‌న‌సు` క‌వి ఆత్రేయ‌గారి మ‌న‌సు ఆయ‌న పాట‌లు రాసినంతకాలం ఆయ‌న ద‌గ్గ‌రే ఉంద‌ని, ఆయ‌న చ‌నిపోయిన త‌ర్వాత అది కృష్ణగారి ఇంటికి వెళ్లింద‌ని ప్ర‌శంసించారు. కృష్ణగారంత‌టి మంచి మ‌నిషిన త‌న జీవితంలో చూడ‌లేద‌న్నారు. 
Tags:    

Similar News