చిరు 150.. బాలయ్య 100.. ఎందుకీ ట్యాగ్స్

Update: 2016-04-17 17:30 GMT
మీడియా వాళ్ల వల్ల రచయితలు.. దర్శకులు ఒత్తిడిలో పడిపోతున్నారని ఫీలైపోతున్నారు సీనియర్ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ. చిరంజీవి 150వ సినిమా.. బాలయ్య 100వ సినిమా అంటూ... ట్యాగులేసి ఆయా సినిమాలకు విపరీతమైన ప్రచారం కల్పించి.. ఆ సినిమాలు చేస్తున్న వాళ్లను విపరీతమైన ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆయన అన్నారు. హీరోలు కూడా ఇలా మైల్ స్టోన్స్ గురించి పట్టించుకోకుండా సినిమాలు చేసుకుంటూ పోవాలని ఆయన హితవు పలికారు. గతంలో తాము కూడా ఇలా ఒత్తిడి వల్ల ఎదురు దెబ్బలు తిన్నామన్నారాయన.

‘‘చిరంజీవి 150వ సినిమా.. బాలకృష్ణ 100వ చిత్రం.. అంటూ సినిమా వాళ్ల ప్రాణాలు తోడేస్తున్నారు. సినిమాలు తీసేవాళ్లు కూడా అది ఎన్నో సినిమానో చెప్పుకుండా తీయొచ్చు కదా. ఇదో మైలురాయి అని చెప్పేసి.. అంచనాలు భారీగా పెంచేస్తే ఆ ఒత్తిడి రచయితల మీద పడుతుంది. అప్పట్లో ‘నిప్పురవ్వ’ పరుచూరి బ్రదర్స్ 200వ సినిమా అని ఏదేదో చెప్పేసి అంచనాలు ఆకాశానికి చేరేలా చేశారు. దీంతో ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. హీరో కృష్ణగారి 200వ సినిమా ‘ఈనాడు’ అని మాకు తెలియదు. రాసేశాం. కానీ 300వ సినిమా విషయంలో ముందే చెప్పేసరికి అనవసర హంగామా మొదలైంది. మాపై ఒత్తిడి పెరిగిపోయింది. అసలు కృష్ణగారు 300వ చిత్రంగా ‘తెలుగువీర లేవరా’ బదులు ‘అడవిలో అన్న’ కథ ఇమ్మన్నారు. కానీ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ మాత్రం ‘ఆ కథ ఆయనకు ఎలా ఎక్కుతుంది? అది నక్సలైట్ల కథ కదా. 300వ సినిమాగా ఇలాంటి కథ ఎందుకు’ అన్నారు. కాబట్టి ఇలాంటి మైల్ స్టోన్స్ విషయంలో అనవసర ప్రెజర్ పెంచుకోవడం మంచిది కాదు’’ అని పరుచూరి అన్నారు.
Tags:    

Similar News