సావిత్రి చివ‌రి జీవితం ఎందుక‌లా?

Update: 2018-08-14 04:13 GMT
సావిత్రి జీవితంపై పూర్తి స్థాయిలో నిజాల్ని `మ‌హాన‌టి` చిత్రంలో చూపించ‌లేదా? అంటే అవున‌నే అంటున్నారు సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు ప‌సుపులేటి రామారావు. `మ‌హాన‌టి` చిత్రాన్ని క‌మ‌ర్షియ‌ల్‌ గా అద్భుతంగా చూపించినా కొన్ని వాస్త‌వాలు పూర్తిగా బ‌య‌ట‌కు రాలేద‌నే ఆయ‌న అంటారు. సినీజ‌ర్న‌లిస్టుగా మ‌ద్రాసు ప‌రిశ్ర‌మ‌తో - సీనియ‌ర్ తార‌ల‌తో సుదీర్ఘ అనుబంధం ఉన్న ప‌సుపులేటి అప్ప‌ట్లోనే ప‌త్రిక‌ల్లో సావిత్రిపై ప‌లు ఆస‌క్తిక‌ర క‌థ‌నాల్ని అందించారు. నాడు `వ‌నితాజ్యోతి`లో ఏడాది పాటు సావిత్రి గురించి సీరియ‌ల్ క‌థ‌నంలో ఆస‌క్తిక‌ర విష‌యాల్ని రివీల్ చేశారు ప‌సుపులేటి.

ఇటీవ‌లే `అద్భుత న‌టి సావిత్రి .. తెర‌వెన‌క నిజానిజాలు` పేరుతో సావిత్రిపై పూర్తి స్థాయి పుస్త‌కాన్ని ప‌సుపులేటి ఆవిష్క‌రించారు. ఆ పుస్త‌కంలో సావిత్రి గురించిన స‌మ‌స్త‌ స‌మాచారం ఉంది. ఒక సీనియ‌ర్ సినీజ‌ర్న‌లిస్టుగా సావిత్రి స‌మ‌కాలికుడిగా పసుపులేటి త‌న ప‌య‌నంలో తెలిసిన ఎన్నో ఆస‌క్తిక‌ర సంగ‌తుల్ని పుస్త‌కంలో డీటెయిల్డ్‌ గా వివ‌ర‌ణ ఇచ్చారు. `ఆమె ఎవ‌రినీ ప‌ట్టించుకోలేదు.. అందుకే ఆమెను ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు` అని రాశారు. జెమిని గ‌ణేష‌న్‌ ని పెళ్లాడ‌వ‌ద్ద‌ని ప‌రిశ్ర‌మ ప్ర‌ముఖులంతా హెచ్చ‌రించినా అది విన‌కుండా సావిత్రి  ఆ ప‌ని చేయ‌డంతో అంద‌రూ ప‌ట్టించుకోవ‌డం మానేశార‌ని ప‌సుపులేటి తెలిపారు.

సావిత్రి జీవితానికి జెమిని గ‌ణేష‌న్ ఓ విల‌న్. సావిత్రిని రెండో పెళ్లాడి పుష్ప‌వ‌ల్లితో స‌హ‌జీవ‌నం చేశాడు. ఇంకా ఎంద‌రితోనూ ఆయ‌న‌కు సంబంధాలున్నాయి. ఆయ‌న నిత్య పెళ్లికొడుకు. 80 ఏళ్ల వ‌య‌సులోనూ జూలీ అనే ఇంగ్లీష్ అమ్మాయిని పెళ్లాడాడు. ఆమె కొంత‌కాలం త‌ర్వాత పారిపోయింది. సావిత్రికి మ‌ద్యం అల‌వాటు చేసిన పాపం ఆయ‌న‌దే. ఆర్థిక‌ప‌ర‌మైన‌ - మాన‌సిక ప‌ర‌మైన స‌మ‌స్య‌లు ఉప్పెన‌లా మీద ప‌డ‌డంతో సావిత్రి పూర్తిగా మందుకు బానిసైంది. అయితే స‌ర‌దాగా మందు అల‌వాటు చేసి జెమిని పెద్ద త‌ప్పు చేశాడు. మ‌హాన‌టి సినిమాలో చూపించింది చాలా ప‌రిమితం. జెమినీని విల‌న్‌ గా చూపించ‌డం వ‌ల్ల అది త‌ట్టుకోలేక ఆయ‌న కుమార్తె ఈ సినిమాపై తీవ్రంగా ఆరోపించారు. జెమినీ గ‌ణేష‌న్ ఆర్థికంగా చితికిపోయినప్పుడు సావిత్రి చాలాసార్లు ఆదుకుంది. కానీ సావిత్రికి అదే ప‌రిస్థితి వ‌చ్చిన‌ప్పుడు అత‌డు త‌న‌ని ఏమాత్రం ఆదుకోలేదు... అని ఎన్నో బ‌య‌టి ప్ర‌పంచానికి తెలియ‌ని సీక్రెట్స్‌ ని ప‌సుపులేటి ఈ పుస్త‌కంలో రివీల్ చేశారు. సినిమాగా తీసిన‌ప్పుడు అంత డీటెయిలింగ్ చూపించ‌లేరు. కానీ పుస్త‌కంలో ప్ర‌తిదీ రాసేందుకు ఆస్కారం ఉంది కాబ‌ట్టి.. ఈ పుస్త‌కం చ‌దివేవారికి ఆస‌క్తి రేకెత్తిస్తుంది. ప్ర‌స్తుతం `అద్భుత న‌టి సావిత్రి` పుస్త‌కం మార్కెట్లో అందుబాటులో ఉంది. సావిత్రి జీవితంపై స‌మ‌గ్రంగా తెలుసుకోవాల‌న్న ఆస‌క్తి ఉన్న‌వారు కొనుక్కుని చ‌దివి తీరాల్సిన పుస్త‌క‌మిది.
Tags:    

Similar News