ప‌వ‌న్ ఫ్యాన్స్ క్లారిటీ కావాలంటున్నారా?

Update: 2022-07-15 00:30 GMT
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు గ‌త కొంత కాలంగా క్లారిటీ లేక.. ప‌వ‌న్ ఏం చేస్తున్నాడో.. ఎందుకు చేస్తున్నాడో తెలియ‌క క‌న్ఫ్యూజ‌న్ కి గుర‌వుతున్నార‌ట‌. ప‌వ‌న్ దాదాపు మూడున్న‌రేళ్ల విరామం త‌రువాత మ‌ళ్లీ 'వ‌కీల్ సాబ్‌' మూవీతో కెమెరా ముందుకొచ్చారు. అయితే ఫ్యాన్స్ కోరుకుంటున్న‌ది ఒక‌టి ప‌వ‌న్ చేస్తున్న‌ది మ‌రోటి. మూడున్న‌రేళ్లు ఏపీ రాజ‌కీయాల కోసం ప‌వ‌న్ కేటాయించారు. అంత వ‌ర‌కు సినిమాకు దూరంగా వుంటూ క్రియాశీల రాజ‌కీయాల్లో యాక్టీవ్ గా వుంటూ వ‌చ్చారు.

ఒక ద‌శ‌లో ప‌వ‌న్‌ ఇక పై సినిమాల్లో న‌టించ‌ర‌నే వార్త‌లు వినిపించాయి. దీంతో అభిమానులు తీవ్ర గంద‌ర‌గోళానికి గుర‌య్యారు. అభిమాన హీరో స‌డ‌న్ గా సినిమాలు మానేస్తే ఎలా అని తీవ్ర ఆందోళ‌న చేశారు. దీంతో దిగొచ్చిన ప‌వ‌న్ మొత్తానికి సినిమాలు చేయ‌డానికి ముడున్న‌రేళ్ల త‌రువాత గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. అయితే స్ట్రెయిట్ మూవీతో పాన్ ఇండియా రేంజ్ సినిమా చేస్తాడ‌ని ఫ్యాన్స్ ఊహ‌ల్లో తేలిపోయారు. కానీ వారికి షాకిస్తూ ప‌వ‌న్ 'పింక్‌' రీమేక్ ఆధారంగా తెర‌కెక్కిన 'వ‌కీల్ సాబ్‌' మూవీతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు.

దీంతో ఫ్యాన్స్ కొంత నిరాశ‌కు గుర‌య్యారు. అయినా సినిమాని భారీ స్థాయిలో కాక‌పోయినా ఫ‌ర‌వాలేద‌నే స్థాయిలో ఆద‌రించారు. ఇక ఈ సినిమా త‌రువాతైనా స్ట్రెట్ క‌థ‌తో ప‌వ‌ర్ ఫుల్ మూవీతో వ‌స్తార‌నుకుంటే మళ్లీ మ‌రో రీమేక్ నే ఎంచుకున్నారు. మ‌ల‌యాళ మూవీ 'అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్' ఆధారంగా 'భీమ్లానాయ‌క్‌' చేశారు. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వ‌ద్ద బాక్సులు బ‌ద్ద‌లు కొట్ట‌లేక‌పోయినా ఫ‌ర‌వాలేద‌నిపించింది. దీని త‌రువాత క్రిష్ డైరెక్ట్ చేస్తున్న 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు'ని ప‌ట్టాలెక్కిస్తార‌ని ఆశ‌ప‌డ్డారు.

అందుకు త‌గ్గ‌ట్టే ప‌వ‌న్ ఈ మూవీ కోసం భారీగా క‌స‌ర‌త్తులు చేస్తూ ప్రిపేర్ అయ్యారు. కానీ తాజా షెడ్యూల్ మాత్రం ముందుకు వెళ్ల‌డం లేద‌ని వార్త‌లు వినిపించాయి. స్క్రిప్ట్ లో మార్పులు అవ‌స‌ర‌మ‌ని ప‌వ‌న్ చెప్ప‌డంతో ఈ సినిమా షూటింగ్ తాజా షెడ్యూల్ ఆగిపోయింద‌నే వార్త‌లు బ‌య‌టికొచ్చాయి. దీనిపై ఇప్ప‌టికీ మేక‌ర్స్ నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌నా లేదు. దీంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ మ‌రింత షాక్ కు గుర‌య్యారు. ఏం జ‌రుగుతోందనే ఆయోమ‌యం వాళ్ల‌లో మొదలైంది.

దీనికి తోడు గ‌త మూడేళ్లుగా ఇక ప‌ట్టాలెక్కుతుంది అంటూ ప్ర‌చారం జ‌రుగుతున్న హ‌రీష్ శంక‌ర్ ప్రాజెక్ట్ 'భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్‌' కూడా ముందుకు వెళ్ల‌డం లేదు. జూన్ లోనే ప‌ట్టాలెక్కుతుంద‌ని ప్ర‌చారం చేసిన ఈ మూవీ ఇప్ప‌ట్లో సెట్స్ పైకి వెళ్లే ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేదు. ఈ ప్రాజెక్ట్ పై ప‌వ‌న్ ఎలాంటి నిర్ణ‌యానికి రాలేక‌పోతున్న కార‌ణంగానే హ‌రీష్ శంక‌ర్ త‌న త‌దుప‌రి సినిమాని రామ్ తో చేయ‌డానికి రెడీ అవుతున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇదిలా వుంటే త‌మిళ చిత్రం 'వినోదాయ సితం' రీమేక్ లో ప‌వ‌న్ న‌టించ‌డానికి రెడీ అయిపోయారు. ఇటీవ‌లే ఈ మూవీని లాంఛ‌నంగా ప్రారంభించార‌ని వార్త‌లు కూడా వినిపించాయి. ఈ ప్రాజెక్ట్ విష‌యంలో ప‌వ‌న్ ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తితో వున్నార‌ట‌. డైరెక్ట్ క‌థ‌ల‌తో చేయాల‌నుకున్న హ‌రీష్ శంక‌ర్‌, సురేంద‌ర్ రెడ్డి ప్రాజెక్ట్ ల‌ని ప‌క్క‌న పెట్టి రీమేక్ ల వెంట ప‌వ‌న్ ఎందుకు ప‌డుతున్నాడో ఫ్యాన్స్ కి అర్థం కావ‌డం లేద‌ట‌. క్లారిటీ లేకుండా ఏంటీ ఈ క‌న్ఫ్యూజ‌న్ అంటూ గంద‌ర‌గోళానికి గుర‌వుతున్నార‌ట‌.
Tags:    

Similar News