ప‌వ‌న్‌.. మ‌హేష్.. కోటిన్న‌ర లెక్క‌

Update: 2016-03-31 04:10 GMT
చిరంజీవి నిష్క్ర‌మ‌ణ త‌ర్వాత టాలీవుడ్ నెంబ‌ర్ వ‌న్ హీరో కుర్చీని అందుకోవ‌డానికి ప్ర‌ధానంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - మ‌హేష్ బాబులే పోటీ ప‌డుతున్నారు. రికార్డుల విష‌యంలో వీళ్లిద్ద‌రిలో ఒక‌రు త‌క్కువ ఇంకొక‌రు ఎక్కువ అని చెప్ప‌డం క‌ష్టం. ఒక‌రు మార్చి ఒక‌రు రికార్డుల మోత మోగిస్తూనే ఉంటారు. ఇప్పుడీ వేస‌విలో ఈ ఇద్ద‌రు సూప‌ర్ స్టార్ల మ‌ధ్య మ‌రోసారి బాక్సాఫీస్ స‌మ‌రానికి రంగం సిద్ధ‌మ‌వుతోంది. స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్‌.. బ్ర‌హ్మోత్స‌వం సినిమాల్లో ఏది దేనిపై పైచేయి సాధిస్తుంది.. ఏది ఎలాంటి రికార్డు నెల‌కొల్పుతుంది అని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఐతే విడుద‌ల‌కు ముందు ఈ రెండు సినిమాలూ రికార్డుల మోత మోగిస్తున్నాయి. బిజినెస్‌.. శాటిలైట్ రైట్స్ విష‌యంలో ఈ రెండు సినిమాల మ‌ధ్య ఆస‌క్తిక‌ర పోటీ నెల‌కొంది.

బ్ర‌హ్మోత్స‌వం సినిమా ఓవ‌ర్సీస్ రైట్స్ రూ.13 కోట్ల‌కు ప‌లికి టాలీవుడ్ లో స‌రికొత్త రికార్డు నెల‌కొల్ప‌గా.. స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ రూ.11.5 కోట్ల‌తో దానికి ద‌గ్గ‌ర‌గా వ‌చ్చింది. ఐతే ఈ విష‌యంలో కోటిన్న‌ర వెన‌క‌బ‌డ్డ ప‌వ‌న్.. ఇంకో విష‌యంలో మ‌హేష్ పై అంతే తేడాతో పైచేయి సాధించ‌డం విశేషం. స‌ర్దార్ మూవీ శాటిలైట్ రైట్స్ రూ.13 కోట్లు ప‌లికిన సంగ‌తి తెలిసిందే. తాజాగా బ్ర‌హ్మోత్స‌వం శాటిలైట్ హ‌క్కుల్ని ఓ ప్ర‌ముఖ ఛానెల్ రూ.11.5 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో శాటిలైట్ హ‌క్కుల్లో ప‌వ‌న్‌.. మ‌హేష్ మ‌ధ్య రూ.1.5 కోట్ల అంత‌రం వ‌చ్చింది. మ‌హేష్ ఓవ‌ర్సీస్ రైట్స్ విష‌యంలో పైచేయి సాధిస్తే.. ప‌వ‌న్ శాటిలైట్ ప‌రంగా ఆధిప‌త్యం చ‌లాయించాడు. ఇక క‌లెక్ష‌న్ల విష‌యంలో వీళ్లిద్ద‌రిలో ఎవ‌రు పైచేయి సాధిస్తారో చూడాలి.
Tags:    

Similar News