అన్నీ నెగెటివే.. అయినా పవన్ ఉన్నాడు

Update: 2016-04-06 15:30 GMT
‘గబ్బర్ సింగ్’ సినిమాకు కొనసాగింపుగా ఇంకో సినిమా తీయాలని పవన్ కళ్యాణ్ ఏ ముహూర్తాన అనుకున్నాడో కానీ.. దీనికి సంబంధించి ప్రతి విషయం నెగెటివ్ గానే జరిగింది. సినిమా మొదలవడానికి ముందు రెండేళ్లు ఏమేం జరిగిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తీరా సెట్స్ మీదికి వెళ్లాక కూడా షూటింగ్ సజావుగా సాగలేదు. పార్ట్ టైం షూటింగ్ చేసినట్లు తోచినపుడు ఒక్కో సీన్ తీసుకుంటూ గడిపేసింది సర్దార్ టీమ్. దీంతో ఎదురు చూపులు మరీ ఎక్కువైపోవడంతో సినిమా మీద జనాలకు ఆసక్తి చచ్చిపోయింది.

రెండు నెలల కిందట పవన్ కు ఉన్నట్లుండి పూనకం వచ్చేసి సినిమాను శరవేగంగా పూర్తి చేయనైతే చేసేశాడు కానీ.. ఔట్ పుట్ మీద జనాలకు చాలా సందేహాలే ఉన్నాయి. ఇంత హడావుడిగా సినిమా పూర్తి చేస్తే ఏం క్వాలిటీ ఉంటుందా అని అనుమానించారు. దీనికి తోడు సర్దార్ ప్రోమోలు ఏవి కూడా మరీ ఎగ్జైట్మెంటేమీ కలిగించలేదు. పవన్ అభిమానుల ఫీలింగేంటో కానీ.. సగటు ప్రేక్షకులు మాత్రం టీజర్లు - ట్రైలర్ చూసి పెదవి విరిచాడు. మరోవైపు ఆడియో కూడా అంచనాలకు తగ్గట్లుగా లేకపోవడం నిరాశ పరిచింది.

మొత్తంగా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ విషయంలో ఇప్పటిదాకా అన్నీ నెగెటివ్ గానే జరిగాయి. ఐతే అలాంటి నెగెటివిటీ ఉన్నపుడు సినిమా విడుదలవతున్నపుడు జనాలు పెద్దగా పట్టించుకోకూడదు. కానీ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ విషయంలో ఇప్పుడున్న హైప్ చూస్తుంటే జనాలకు మతిపోతోంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో.. అటు రెస్టాఫ్ ఇండియా లొకేషన్లలో.. మరోవైపు ఓవర్సీస్ లో సర్దార్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఎక్కడా చూసినా ఆల్రెడీ క్యూలు కనిపిస్తున్నాయి. బెనిఫిట్ షోల టికెట్ల కోసం కూడా తెగ ఎగబడుతున్నారు. ఆ టికెట్ల ధరలు భారీగా ఉన్నా జనాలు తగ్గట్లేదు. ఇదంతా చూశాక పవన్ కళ్యాణ్ పవరేంటో అందరికీ మరోసారి అర్థమవుతోంది.
Tags:    

Similar News