ఏపీలోనూ బెనిఫిట్ షోలను బ్యాన్ చేస్తారా?
ఇదిలా ఉంటే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఈ విషయం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడుకు లేఖ రాసినట్లు తెలుస్తోంది.
తెలంగాణా రాష్ట్రంలో ఇకపై బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల హైక్స్ ఉండవని సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. అల్లు అర్జున్ ఎపిసోడ్ నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనికి సామాన్య ప్రజానీకం నుంచి సానుకూల స్పందన లభించింది. తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సైతం సర్కారు నిర్ణయాన్ని స్వాగతించింది. దీంతో ఇప్పుడు ఏపీలోనూ అలాంటి నిర్ణయమే తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది.
బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ ఎగ్జిబిటర్లు కూడా స్వాగతించారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తామని చెప్పారు. ఇక ఏపీ బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు తాను రేవంత్ నిర్ణయాన్ని సమర్ధిస్తున్నానని అన్నారు. అదే విధంగా బెనిఫిట్ షోలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలానే టీడీపీ నేత బండారు సత్యనారాయణ సైతం బెనిఫిట్ షో ఎవరి కోసం వేస్తున్నారని.. ఎవరికి బెనిఫిట్ కలుగుతోందని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఇదిలా ఉంటే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఈ విషయం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడుకు లేఖ రాసినట్లు తెలుస్తోంది. టికెట్ ధరలను పెంచడం, బెనిఫిట్ షోలకు అనుమతించే విధానాలను సీపీఐ పార్టీ ఖండిస్తుందని పేర్కొన్నారు. సినీ రంగానికి తలొగ్గి దేశంలో ఎక్కడా లేని విధంగా టికెట్ల ధరలను విపరీతంగా పెంచుకునేందుకు, బెనిఫిట్ షోలు వేసేందుకు పర్మిషన్ ఇవ్వడంపై విమర్శలు గుప్పించారు. పెద్ద సినిమాలకు టికెట్ల ధరలను ఇబ్బడిముబ్బడిగా పెంచడమంటే, ప్రేక్షకుల జేబులు కొల్లగొట్టడమేనని ఆయన అభిప్రాయ పడ్డారు.
సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడంపై విచారం వ్యక్తం చేసిన రామకృష్ణ.. ఈ దుర్ఘటన తర్వాత తెలంగాణలో సినిమాలకు ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతి ఇవ్వబోమని, టికెట్ల రేట్లు పెంచబోమని సీఎం రేవంత్.రెడ్డి ప్రకటించడాన్ని స్వాగతించారు. తెలంగాణ తరహాలో ఆంధ్రప్రదేశ్ లోనూ బెనిఫిట్ షోలు రద్దు చేయాలని, టికెట్ ధరలు పెంచుకోడానికి అనుమతులు ఇవ్వబోమని ప్రకటన చేయాలని సీపీఐ రామకృష్ణ డిమాండ్ చేసారు. మరి ఏపీలోనూ ఈ విషయం మీద కీలక నిర్ణయం తీసుకుంటారేమో చూడాలి.
ఇటీవల కాలంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన పెద్ద సినిమాలకు బెనిఫిట్ షోలు వేసుకోడానికి, టికెట్ రేట్లు పెంచుకోడానికి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు మంజూరు చేస్తూ వచ్చాయి. దీంతో ఇష్టానుసారంగా రేట్లు పెంచుకుంటూ వచ్చారు. అయితే అధిక ధరల కారణంగా సాధారణ ప్రేక్షకులు థియేటర్లకు దూరం అవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. దీని వల్ల థియేటర్ సిస్టమ్ నష్టపోతుందని, చిన్న మీడియం బడ్జెట్ సినిమాల కలెక్షన్స్ మీద ప్రభావం పడుతుందనే కామెంట్లు వచ్చాయి.
అయితే ఇప్పుడు తెలంగాణాలో స్పెషల్ షోలు, టికెట్ రేట్లు ఉండవని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీ సమస్యలపై చర్చించడానికి, ప్రభుత్వంతో పెరుగుతున్న దూరాన్ని తగ్గించడానికి సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ అవుతున్నారు. టాలీవుడ్ నుంచి చిరంజీవి, వెంకటేష్, అల్లు అరవింద్, దిల్ రాజుతో సహా పలువురు నిర్మాతలు, దర్శకులు హాజరవుతారని వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ హాజరవుతారని అంటున్నారు. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.