నాని 'హాయ్ నాన్న' రీమేకా? ఆ ఆరోపణలు నిజమేనా?

తండ్రీ కుమార్తెల సెంటిమెంట్‌ తో యంగ్ డైరెక్టర్ శౌర్యువ్‌ ఆ సినిమాను తెరకెక్కించారు.

Update: 2025-01-30 13:52 GMT

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. సరిపోదా శనివారం మూవీతో గత ఏడాది మంచి హిట్ అందుకున్నారు. అంతకుముందు హాయ్ నాన్న చిత్రంతో ప్రేక్షకులను మెప్పించారు. తండ్రీ కుమార్తెల సెంటిమెంట్‌ తో యంగ్ డైరెక్టర్ శౌర్యువ్‌ ఆ సినిమాను తెరకెక్కించారు.

ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఆ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా యాక్ట్ చేశారు. వైరా ఎంటర్టైన్మెంట్స్‌ బ్యానర్ పై సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఆ సినిమా 2023లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. అనేక అవార్డులు కూడా అందుకుని సత్తా చాటింది హాయ్ నాన్న మూవీ.

అయితే నాని యాక్టింగ్ కు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి. నేచరుల్ స్టార్ గా మరోసారి ప్రూవ్ చేసుకున్నారని అంతా కొనియాడారు. అదే సమయంలో ఓటీటీలో, టీవీల్లో కూడా హాయ్ నాన్న మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు ఆ సినిమా రీమేక్ అని కన్నడ నిర్మాత పుష్కర మల్లికార్జునయ్య ఆరోపించారు.

అది కూడా తమ సినిమాను తెలుగులో హాయ్ నాన్నగా రీమేక్ చేశారని తాజాగా ఆరోపణలు చేశారు. తాను ప్రొడ్యూస్ చేసిన భీమసేన నలమహారాజ మూవీ ఆధారంగా హాయ్ నాన్ మూవీ తీశారని, అందుకు గాను రీమేక్ హక్కులు కొనుగోలు చేయలేదని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు.

అంతటితో ఆగకుండా ఇలాంటి నీచమైన పనులు ఎలా చేస్తారని మేకర్స్ ను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. దీంతో ఆయన పోస్ట్ అండ్ కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో నాని ఫ్యాన్స్ ఫుల్ గా స్పందిస్తున్నారు. మేకర్స్ స్పందించి.. ఆయనకు సరైన రీతిలో ఆన్సర్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నారు.

అయితే 2020లో భీమసేన నలమహారాజ నేరుగా ఓటీటీలో విడుదలైంది. డ్రామా ఫిల్మ్‌ గా కార్తీక్ సర్గూర్ తెరకెక్కించగా.. అరవింద్‌ అయ్యర్‌, అరోహి నారాయణ్‌, ప్రియాంక తిమ్మేశ్‌ ముఖ్యపాత్రల్లో యాక్ట్ చేశారు. రక్షిత్‌ శెట్టితో కలిసి పుష్కర మల్లికార్జునయ్య నిర్మించారు. ఇప్పుడు ఆయన తమ సినిమా హక్కులు కొనుగోలు చేయకుండా హాయ్ నాన్న తీశారని ఆరోపిస్తున్నారు. మరి ఇందులో నిజమెంతో.. మూవీ టీమ్ స్పందిస్తే గానీ తెలియదు.

Tags:    

Similar News