గోవా స్థానికులు గూండాల్లా ప్రవర్తించారు: ఆయేషా టకియా
సూపర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆయేషా టకియా ఫ్యామిలీతో గోవా వెళ్లగా అక్కడ ఆమె భర్త అరెస్టయ్యాడు.;
సూపర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆయేషా టకియా ఫ్యామిలీతో గోవా వెళ్లగా అక్కడ ఆమె భర్త అరెస్టయ్యాడు. గోవాలో ఆయేషా భర్త ఫర్హాన్ అజ్మీ కారు డ్రైవింగ్ కేసులో అరెస్టయ్యాడు. అయితే ఫర్హాన్ అరెస్ట్ వివాదం రోజు రోజుకీ తారా స్థాయికి చేరుతుండగా అన్యాయంగా తన భర్తను కేసులో ఇరికించారని ఆయేషా ఆరోపిస్తుంది.
గోవాలో ఆయేషా భర్త ఫర్హాన్ ఓ సూపర్ మార్కెట్ కార్నర్ దగ్గర సిగ్నల్ వేయకుండానే కారును నడపడం వల్ల అసలు గొడవ మొదలైంది. నిర్లక్ష్యంగా కారుని నడిపాడని ఇద్దరు స్థానికులు ఫర్హాన్ తో గొడవకు దిగడం, ఆ గొడవ కాస్త పెద్ద దవడంతో ఒక్కసారిగా జనం పోగయ్యారు. స్థానికులతో జరిగిన గొడవలో పర్హాన్ తన దగ్గరున్న లైసెన్డ్స్ గన్ తీశాడనే ఆరోపణపై ఆయన్ని గోవా పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు తన భర్తను అరెస్ట్ చేసినప్పటి నుంచి ఆయేషా తమ తప్పేమీ లేదని సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెడుతుంది. ఈ నేపథ్యంలోనే ఆయేషా తాజాగా గొడవకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ అక్కడి స్థానికుల తీరుపై మండిపడింది. గోవా ప్రజలు గూండాల్లా బిహేవ్ చేశారని, తప్పుడు ప్రచారాలు చేయకుండా అన్నీ వీడియోలు చూసి ఓ అంచనాకు రావాలని ఆయేషా పోస్ట్ చేసింది.
గొడవ గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే తన భర్తను అదుపులోకి తీసుకున్నారని, అప్పుడు కూడా కొంతమంది మహిళలు తీవ్ర పదజాలంతో తన పదకొండు సంవత్సరాల కొడుకును తిట్టారని, మహిళలు ఇంత అసహస్యంగా మాట్లాడతారా అని ఆశ్చర్యపోతూ వారు ప్రవర్తించిన విధానం సిగ్గుచేటని రాసుకొచ్చింది.
మహారాష్ట్ర నుంచి వచ్చినందుకే గోవా స్థానికులు తమను టార్గెట్ చేశారని, పోలీసులు కూడా తమకు వ్యతిరేకంగానే ఉన్నారని తెలిపిన ఆయేషా, అదొక పీడకల అని వరుస పోస్టులు పెడుతుంది. అక్కడి ప్రజలు తమ కుటుంబాన్ని గంటల తరబడి హింసించారని, ప్రాణాలు తీసేందుకు కూడా తెగబడ్డారని ఆమె ఆరోపించింది. తన దగ్గర ఉన్న వీడియోలను కోర్టుకు అందచేసి, తమకు న్యాయం జరిగేలా చూసుకుంటానని ఆయేషా చెప్తోంది. మరి ఈ వివాదం ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.