సూపర్‌ సినిమా అయినా ఇక్కడ కష్టమే..!

లూసీఫర్‌కి సీక్వెల్‌గా రూపొందిన ఎల్‌ 2 ఎంపురాన్‌ సినిమాను భారీ ఎత్తున కేరళలో విడుదల చేయబోతున్నారు.;

Update: 2025-03-06 11:30 GMT

మలయళ సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌కి తెలుగులో మంచి క్రేజ్ ఉంది. ఆయన నటించిన మలయాళ సినిమాలు మాత్రమే కాకుండా నేరుగా తెలుగులో నటించిన సినిమాలు సైతం తెలుగు రాష్ట్రాల్లో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. గతంలో మోహన్‌ లాల్‌ నటించిన తెలుగు సినిమాలు, మలయాళ సినిమాలు మంచి వసూళ్లను తెలుగు బాక్సాఫీస్ వద్ద రాబట్టిన నేపథ్యంలో తాజాగా ఆయన నటించిన 'ఎల్‌ 2' సినిమాను భారీ ఎత్తున విడుదల చేయాలని ప్లాన్‌ చేశారు. కానీ అందుకు పరిస్థితులు అనుకూలించేలా లేదు. ఎందుకంటే మోహన్‌ లాల్‌ 'ఎల్‌ 2' మార్చి 27న విడుదల కాబోతుంది. అదే సమయంలో తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ పలు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

లూసీఫర్‌కి సీక్వెల్‌గా రూపొందిన ఎల్‌ 2 ఎంపురాన్‌ సినిమాను భారీ ఎత్తున కేరళలో విడుదల చేయబోతున్నారు. కానీ కేరళ బయట విడుదల చేయడానికి మాత్రం అనుకూలమైన పరిస్థితులు కనిపించడం లేదు. బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకునే సత్తా ఉన్న సినిమా అయినప్పటికీ తెలుగులో ఉన్న పోటీ కారణంగా పెద్దగా బయ్యర్ల నుంచి ఆసక్తి కనిపించడం లేదు. తెలుగులో రాబిన్‌వుడ్‌ సినిమాను మార్చి 28న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు మంచి బజ్‌ ఉంది. అంతే కాకుండా సినిమా హిట్‌ కాంబో కావడంతో ప్రేక్షకులు అటు వైపుగా ఆసక్తి చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

నితిన్‌ 'రాబిన్‌వుడ్‌' సినిమాతో పాటు మరికొన్ని సినిమాలు సైతం తెలుగు బాక్సాఫీస్ వద్ద ఆ సమయంలో సందడి చేయబోతున్నాయి. ముఖ్యంగా తమిళ్‌ మూవీ వీరధీర శూరన్ పార్ట్‌ 2 ను మార్చి 27న విడుదల చేయబోతున్నారు. తమిళ్‌తో పాటు తెలుగులోనూ ఈ సినిమాకు మంచి బజ్‌ ఉంది. అందుకే ఈ సినిమాను తెలుగులో భారీ ఎత్తున విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. విక్రమ్‌ హీరో కావడంతో తెలుగులో మినిమం బజ్‌ ఉంటుంది. మోహన్‌ లాల్‌ సినిమా కంటే విక్రమ్‌ సినిమాకు తెలుగులో ఎక్కువ క్రేజ్ ఉంటుంది. అందుకే ఎల్‌ 2 తో పోల్చితే వీర ధీర శూరన్‌ పార్ట్‌ 2 కి ఎక్కువ థియేటర్లు లభించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

ఎల్‌ 2 సినిమాకి సూపర్‌ హిట్‌ టాక్ వస్తే అప్పుడు సినిమాకు మంచి స్పందన దక్కే అవకాశాలు ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించే విధంగా ఎల్‌ 2 ఉంటే అప్పుడు పోటీని తట్టుకుని నిలబడే అవకాశాలు ఉన్నాయి అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సూపర్‌ స్టార్‌ సినిమా అయినా పోటీ ఉన్న నేపథ్యంలో కాస్త డల్‌గానే ఓపెనింగ్స్‌తో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. హిట్‌ టాక్‌ వస్తే ఏ పోటీ ఆపలేక పోవచ్చు. డబ్బింగ్‌ సినిమాలు అయినా తెలుగులో భారీగా వసూళ్లు సాధించిన సందర్భాలు ఉన్నాయి. కనుక ఎల్‌ 2 కి ఎలాంటి స్పందన వస్తుంది అనేది చూడాలి.

Tags:    

Similar News