అజ్ఞాతవాసి ఫ్లాప్ గురించి పవన్ కళ్యాణ్

Update: 2018-01-23 05:15 GMT
పవర్ స్టార్ అజ్ఞాతం వీడి బయటికి వచ్చాక ఒక్కో విషయం గురించి తన అభిప్రాయలు జనసేన కార్యకర్తలతో పంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్న కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి తన అప్రహతిహత రాజకీయ యాత్ర ప్రారంభించిన పవన్ కళ్యాణ్ కరీంనగర్ జనసేన కార్యకర్తలతో జరిపిన సమావేశంలో ఈ మధ్య తననే టార్గెట్ చేసుకుని వస్తున్న పలు అంశాల గురించి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసాడు. సినిమాలు చేసుకోకుండా తనను ఎవరూ ఆపలేరని, ఫ్లాప్స్ ఇచ్చినప్పుడు విమర్శలు వస్తాయని, కాని అలాంటి వాటిని సినిమాల పరంగా కంటే ప్రజాసేవలో ఉంటూ రాజకీయ పరంగా ఎదురుకోవడమే తనకు ఇష్టమని తేల్చి చెప్పాడు. సౌత్ ఇండియాలో అత్యధికంగా టాక్స్ కడుతున్న హీరోల్లో తానూ ఒకడినని, ఇప్పటికిప్పుడు సినిమాలు మానేయడానికి కారణం రాజకీయాల్లో మరింత క్రీయశీలకంగా ఉండటం కోసమే అన్నారు.

రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శలు సహజంగానే వస్తుంటాయని అలా అని వాటిని ఎదురుదాడితో తిప్పి కొట్టాలి అనుకోవడం సరైన చర్య కాదని సోషల్ మీడియాలో తన మీద ఫిలిం క్రిటిక్ రేపిన వివాదం గురించి పేరు ప్రస్తావించకుండా మాట్లాడాడు పవన్. అలాంటివి భరించడానికి తాను సిద్దంగా ఉన్నానని, మీకు కొంత బాధ కలగడం సహజమని చెప్పిన పవన్ బలవంతుడు దేన్నైనా భరిస్తాడని, మనం బలవంతులమని అక్కడ ఉన్నవారిని మోటివేట్ చేయడానికి ప్రయత్నించాడు. కామెంట్స్ చేసే వాళ్ళు ఎన్నిసార్లు చేసినా అలా చూస్తూ ఉండండి తప్ప వాటికి స్పందించడం మానుకోండి అని హితవు పలికాడు.

కొందరు తనను రాజకీయ పార్టీ పెట్టడం గురించి ప్రశ్నిస్తున్నారని, ఎన్జీఓ లాంటిది పెట్టకుండా ఎందుకొచ్చిన రాజకీయాలు అన్నారని, అలా చేస్తే కొందరికే సహాయం చేసే అవకాశం కలుగుతుందని, అలా కాకుండా రాజకీయాల ద్వారా ఎక్కువ శాతం ప్రజలకు మేలు చేసే అవకాశం కలుగుతుందని చెప్పిన పవన్ జనసేన సిద్ధాంతం ప్రజలకు సహాయం చేయటమే తప్ప అధికారం -డబ్బు - పేరు కానేకాదని తేల్చి చెప్పేసాడు. పవన్ చెప్పిన విషయాలు ఇప్పుడు జనసేనతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా చర్చకు దారి తీసాయి. ఎక్కడా వ్యక్తులను కాని సినిమాలను కాని ప్రస్తావించకుండా తాను చెప్పాలనుకున్నది చెప్పే ప్రయత్నంలో పవన్ ఇలా మాట్లాడాడు అనే కోణంలో విశ్లేషణ జరుగుతోంది.
Tags:    

Similar News