పవన్ స్పెషల్: డైరెక్షన్ కాదు.. అంతకుమించి

Update: 2016-03-12 11:06 GMT
పవన్ కళ్యాణ్ కేవలం నటుడు మాత్రమే కాదని.. అతను సినిమాల్లోకి వచ్చిన కొన్నేళ్లకే జనాలకు అర్థమైంది. ‘ఖుషి’ సినిమా సమయానికే అతడిలోని స్టంట్ కొరియోగ్రాఫర్ నిద్ర లేచాడు. ఆ తర్వాత తనే సొంతంగా పాటలకు కాన్సెప్టులు తయారు చేసుకున్నాడు. ఆపై ‘జానీ’ సినిమాతో ఏకంగా మెగా ఫోనే పట్టేశాడు. ఆ తర్వాత ‘సత్యాగ్రహి’ పేరుతో స్వీయ దర్శకత్వంలో ఇంకో సినిమా చేయడానికి తయారయ్యాడు కానీ.. అది అనివార్య కారణాలతో పక్కకు వెళ్లిపోయింది. తాజాగా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాకు కథ - స్క్రీన్ ప్లే అందిస్తూ.. అనధికారికంగా దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.

మరి మళ్లీ పూర్తి స్థాయిలో దర్శకత్వం ఎప్పుడు చేపడతారు అని బాలీవుడ్ క్రిటిక్ అనుపమ చోప్రా తన ఇంటర్వ్యూలో అడగ్గా అందుకు అవకాశం లేదని చెప్పేశాడు పవన్. అలాగని దర్శకత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండబోనని కూడా చెప్పలేదు పవన్. ‘‘దర్శకత్వం అంటే నాకు నేను ఓ పరిధి గీసేసుకుని ఉండటమే అనిపించింది. అంతకుమించి ఏదో చేయగలనని.. చేయాలని అనిపిస్తోంది. ఇండస్ట్రీలో చాలామంది టాలెంటెడ్ యంగ్ స్టర్స్ ఉన్నారు. వాళ్లు దర్శకత్వ బాధ్యతల్ని బాగా నిర్వర్తించగలరు. నేను స్టోరీ - స్క్రీన్ ప్లే రాసి నా వంతుగా ఇంకేం చేయాలో అది చేస్తే బాగుంటుందనిపిస్తోంది. మళ్లీ దర్శకత్వం మాత్రం చేయను’’ అని చెప్పాడు పవన్. ఐతే పవన్ సమాధానంలో కొంచెం క్లారిటీ మాత్రం మిస్సయింది. డైరెక్షన్ కాదు.. అంతకుమించి ఏదో చేస్తానంటాడు. అదే సమయంలో దర్శకత్వం చేయడానికి వేరే టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు అంటాడు. అన్నీ తానై వ్యవహరిస్తా.. కానీ దర్శకత్వం మాత్రం తాను చేయను అన్నడం విడ్డూరమే కదా.

Tags:    

Similar News