పవన్‌.. త్రివిక్రమ్‌ అభిమానుల కోరిక తీర్చడం ఖాయం!

Update: 2021-04-16 06:30 GMT
అజ్ఞాతవాసి సినిమా తర్వాత పవన్ నుండి కనీసం ఒక్క సినిమా అయినా వస్తుందా అని పవన్‌ అభిమానులు అనుకున్నారు. ఆయన రాజకీయాలతో బిజీ అవ్వడంతో పాటు సినిమాలకు దూరం అవ్వాలనుకుంటున్నట్లుగా ఒకటి రెండు సార్లు హింట్ ఇవ్వడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు. కాని అభిమానులను ఆనందపర్చడంతో పాటు ఆర్థికంగా బలపడేందుకు అన్నట్లుగా పవన్‌ కళ్యాణ్‌ వరుసగా సినిమాలను చేస్తున్నాడు. ఇక పవన్‌ కళ్యాణ్‌.. త్రివిక్రమ్‌ కాంబో మూవీ అంటే అభిమానులు ఎప్పుడు కూడా ఎంతో ఆసక్తిగా ఉంటారు. జల్సా.. అత్తారింటికి దారేది సినిమాల తర్వాత వీరి కాంబోలో వచ్చిన అజ్ఞాతవాసి సినిమా నిరాశ పర్చింది. ఆ సినిమా పోయినా కూడా వీరి కాంబోకు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు.

పవన్‌ నాలుగు అయిదు సినిమాలకు వరుసగా కమిట్ అయ్యాడు. కాని అందులో ఒక్కటి కూడా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో మూవీ లేకపోవడంతో అభిమానులు కాస్త అసంతృప్తిగా ఉన్నారు. పవన్‌ కళ్యాణ్‌... త్రివిక్రమ్‌ కాంబో మూవీ కావాల్సిందే అంటూ కోరుకునే అభిమానులు చాలా మంది ఉన్నారు. వారందరి కోరిక తీరడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు చాలా నమ్మకంగా చెబుతున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ కమిట్‌ అయ్యి ఉన్న సినిమాలను పూర్తి చేసిన వెంటనే త్రివిక్రమ్‌ తో మూవీ పట్టాలెక్కించే అవకాశం ఉందంటున్నారు.

ప్రస్తుతం పవన్‌ రానాల కాంబోలో రూపొందుతున్న సినిమాకు త్రివిక్రమ్‌ స్క్రిప్ట్‌ అందిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా తర్వాత మహేష్ బాబుతో త్రివిక్రమ్‌ మూవీ ఉంటుంది. మహేష్‌ బాబుతో సినిమా తర్వాత త్రివిక్రమ్‌ చేయబోతున్న సినిమా పవన్‌ కళ్యాణ్‌ తోనే అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఎన్టీఆర్‌ తో కూడా త్రివిక్రమ్‌ ఒక సినిమా చేయాల్సి ఉంది. కాని అది ఎప్పుడు అనే విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

అజ్ఞాతవాసి సినిమాపై అంచనాలు భారీగా పెట్టుకున్న నేపథ్యంలో ఆ సినిమా తీవ్రంగా నిరాశ పర్చింది. కనుక పవన్‌ తో ఒక మంచి సినిమా అది కూడా అభిమానులను ఆనందపర్చే కమర్షియల్‌ మూవీ చేయాలని త్రివిక్రమ్‌ బలంగా కోరుకుంటున్నాడు. త్రివిక్రమ్‌ కోరాలే కాని పవన్ డేట్లు ఇవ్వకుండా ఉంటాడా చెప్పండి. వారిద్దరి మద్య అంతటి స్నేహం ఉంది అనేది జగమెరిగిన సత్యం. అందుకే వీరిద్దరి కాంబో సినిమా ఖచ్చితంగా వస్తుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News