టిక్కెట్టు రేట్లతో ఇంకా దోచుకుందామనే??

Update: 2017-09-06 17:30 GMT
ఇప్పటికే అసలు ఎందుకూ పనికిరాని సింగిల్ స్ర్కీన్ ధియేటర్లలో సినిమా టిక్కెట్టు రేటును 100 రూపాయలు చేశారు. సినిమాలను తీయడానికి ఖర్చుపెరుగుతోందని ప్రొడ్యూసర్లు చెబుతుంటే.. కొనడానికి ఎక్కువ పెట్టేస్తున్నాం అంటూ పంపిణీదారులు చెబుతున్నారు. వీటికి తోడు ఇప్పుడు జి.ఎస్.టి అనే బాధుడు కూడా ఉండనే ఉంది. మొత్తంగా మల్టీప్లెక్సుల్లోనే మొన్నటివరకు కనిపించిన రేట్ల బాదుడు.. ఇప్పుడు సింగిల్ స్ర్కీన్లో కూడా కనిపిస్తోంది. ఇప్పుడు మరోసారి వడ్డన దిశగా మనోళ్లు తెలివైన ఐడియాలు వేస్తున్నారు.

అమెరికాలో పద్దతి ఏంటంటే.. ఏ సినిమా టిక్కెట్ రేట్ అయినా కూడా.. ఇంతని నికరంగా ఉండదు. ఎందుకంటే అక్కడ డిస్ర్టిబ్యూటర్ తనకు నచ్చినట్లు పెంచుకోవచ్చు. అందుకే మన తెలుగు సినిమాల కొన్నంటి టిక్కెట్ ధరలు 20 డాలర్లు ఉంటాయి. మొదటి వారంలో పెంచేసి.. ఫ్లాప్ టాక్ వస్తే వెంటనే 10 డాలర్లు చేస్తారు. హిట్ టాక్ వస్తే 25 డాలర్లు కూడా చేస్తుంటారు. 10 డాలర్లకు 1+1 ఆఫర్ అంటూ ఇస్తుంటారు. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో కూడా ఇలా డిమాండ్ ను బట్టి టిక్కెట్టు రేటును నిర్దేశించే ఐడియాలను ప్రవేశపెట్టాలని పావులు కదుపుతున్నారు పెద్దలు. దీని వలన ఫ్లాప్ అయిన సినిమాలకు తక్కువ రేటు పెడితే.. ఖచ్చితంగా ఎక్కువమంది జనాలు వచ్చి చూస్తారని వీరి ఆలోచనట.

అసలు ఈ మోడల్ మన తెలుగు రాష్ట్రాల్లో వర్కవుట్ అవుతుందా అవదా అనే విషయం పక్కనెట్టేస్తే.. పన్ను మినహాయింపు వచ్చిన చిత్రాలకే తక్కువ రేట్లకు మనం టిక్కెట్లు అమ్మిన పాపాన పోలేదు. ఇప్పుడు ఈ మోడల్ ప్రవేశపెట్టేసి టిక్కెట్ రేట్లను ఇంకాస్త పెంచుకుందాం అనే దాహం తప్పించి.. నిజంగా వీళ్ళు తగ్గించి అమ్ముతారంటారా? కాకపోతే చిన్న సినిమాల నిర్మాతలు టిక్కెట్ రేటును తగ్గించి అమ్మితే.. జనాలకు ఎక్కువగా వచ్చే ఛాన్సుంటుంది. చూద్దాం ఏమవుతుందో!!
Tags:    

Similar News