మలయాళీ నటి ప్రియా ప్రకాష్ వారియర్ ఇప్పుడు ఎంతటి సెన్సేషన్ అని చెప్పాల్సిన పని లేదు. కేవలం ఒక్క పాటతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయి.. ఇంటర్నెట్ సెర్చింగ్ లో దేశంలోనే రెండో స్థానాన్ని ఆక్రమించేసిన ఘనత ఈమెది. అయితే.. ఇప్పుడీమె ఓ వివాదంలో చిక్కుకున్నట్లుగా కనిపిస్తోంది. హైద్రాబాద్ లోని ఫలక్ నుమా పోలీస్ స్టేషన్ లో ప్రియా ప్రకాష్ పై కేసు నమోదు అయింది.
ముస్లింల మనోభావాలను దెబ్బతీసేలా నటించిందంటూ.. ఆమెపై ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేశారు పోలీసులు. ఇంతకీ ఇదో లవ్ స్టోరీ. ఓ స్టేడియంలో జరుగుతున్న ఈవెంట్ లో.. ఓ కుర్రాడు- కుర్రది సైట్ కొట్టుకుంటున్న సీన్ అది. ఇందులో మనోభావాల మాట ఎక్కడి నుంచి వచ్చిందని అనుకోవచ్చు. కానీ అసలు సంగతి ఆమె నటించడం కాదు లెండి.. ఆ పాట గురించి సమస్యంతా వచ్చింది. మాణిక్య మలరావి పూవి అంటూ సాగే ఈ పాటతోనే గొడవ అంతా మొదలైంది. ఇది మలబార్ ప్రాంతానికి చెందిన ముస్లింలు తమ కొన్ని పండుగలలో ఈ పాటను పాడుకుంటూ ఉంటారు.
మహమ్మద్ ప్రవక్త.. అతని భార్య ఖదీజా.. పాడుకున్న పాట అని వారి నమ్మకం. వారి ప్రేమకు చిహ్నంగా ఈ పాటను పరిగణిస్తారు. ఇప్పుడా పాటను ఈ కుర్రాళ్ల ప్రేమకథకు వాడేసుకోవడం కొంతమందికి నచ్చడం లేదు. అందుకే ఈ కేసు నమోదయినట్లుగా తెలుస్తోంది.