ఇండ‌స్ట్రీ పాలిటిక్స్ కి ఇప్ప‌టికైనా తెరప‌డేనా?

Update: 2022-02-16 09:31 GMT
ప్ర‌తీ విష‌యంలోనూ సినిమా వాళ్లంతా ఒక్క‌టే మేమంతా ఒకే కుటుంబం.. మా మధ్య ఎలాంటి మ‌న‌స్ప‌ర్థం లేవ‌ని చెబుతుంటారు టాలీవుడ్ వ‌ర్గాలు. మాటలో యూనిటీ కానీ చేత‌ల్లో మాత్రం ఎక్క‌డా యూనిటీ క‌నిపించ‌డం లేదు. గ‌తంలో జ‌రిగిన `తెలుగు సినిమా వ‌జ్రోత్స‌వాల్లో` ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ఏ స్థాయిలో భేదాభిప్రాయాలు వున్నాయో యావ‌త్ ప్ర‌పంచానికి తెలిసింది. ఆ త‌రువాత‌  రాజేంద్రప్ర‌సాద్ వర్సెస్‌ జ‌య‌సుధ మ‌ధ్య జ‌రిగిన `మా` ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ ఇదే విష‌యం మ‌రో సారి రుజువై టాలీవుడ్ లో భారీ ర‌చ్చ‌కు దారితీసింది.

ఇఉ వ‌ర్గాల వెన‌క రాజ‌కీయ పార్టీలు వుండ‌టం అప్ప‌ట్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇక  ఇటీవ‌ల ప్ర‌కాష్ రాజ్ వ‌ర్సెస్ మంచు విష్ణు పోటా పోటీగా పోటీప‌డిన `మా` ఎన్నిక‌ల్లోనూ టాలీవుడ్ లో వున్న వ‌ర్గ విభేధాలు మ‌రోసారి బ‌య‌ట‌ప‌డిన విష‌యం తెలిసిందే. ఇంత జ‌రుగుతున్నా మీడియా యుందుకు వ‌చ్చిన ప్ర‌తీసారి మేమంతా ఒక‌టే అంటూ స్టేట్‌మెంట్ లు ఇవ్వ‌డం టాలీవుడ్ వర్గాల‌కు స‌ర్వ‌సాధార‌ణంగా మారిపోయింది. తాజాగా టాలీవుడ్ వ‌ర్గాల్లో యూనిటీ లేద‌ని మంగ‌ళ‌వారం మంచు విష్ణు మ‌రోసారి నిరూపించారని నెట్టింట మీమ్స్ ద్వారా విమర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

ఏపీ టికెట్ ల వివాదంతో పాటు తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ ఎదుర్కొంటున్నఅనేక స‌మ‌స్య‌ల‌పై ఏపి ముఖ్యమంత్రితో టాలీవుడ్ ప్ర‌ముఖులైన మెగాస్టార్ చిరంజీవి - ప్ర‌భాస్ - మ‌హేష్ బాబు, స్టార్ డైరెక్ట‌ర్స్  రాజ‌మౌళి - కొర‌టాల శివ - ఆర్. నారాయ‌ణమూర్తి - నిర్మాత నిరంజ‌న్ రెడ్డి - పోసాని కృష్ణ‌ముర‌ళి - అలీ ప్ర‌త్యేకంగా భేటీ అయిన విష‌యం తెలిసిందే. భేటీ అనంత‌రం ఏఎం ఇండ‌స్ట్రీ స‌మ‌స్య‌ల‌పై సానుకూలంగా స్పందించార‌ని, త్వ‌ర‌లోనే ఇండ‌స్ట్రీ ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌కు ఎండ్ కార్డ్ ప‌డ‌బోతోందంటూ చిరంజీవి నుంచి మ‌హేష్‌.. ప్ర‌భాస్ .. రాజ‌మౌళి వ‌ర‌కు అంతా  ఒకే మాటని వినిపించారు.

దీంతో ఏపీలో తెలుగు సినిమా ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌కు ఎండ్ కార్డ్ ప‌డుతుంద‌ని టాప్ స్టార్ ల‌తో పాటు డైరెక్ట‌ర్ లు.. నిర్మాత‌లు సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. ఇది జ‌రిగి నాలుగు రోజులు గ‌డ‌వ కుండానే `మా` అధ్య‌క్షుడు - హీరో మంచు విష్ణు ఏపీ ముఖ్యంత్రి వైఎస్ జ‌గ‌న్ ని ప్ర‌త్యేకంగా క‌ల‌వ‌డం.. కేవ‌లం బంధువు కాబ‌ట్టి ఆయ‌న‌తో లంచ్ చేయ‌డానికి మాత్ర‌మే వ‌చ్చాన‌ని చెప్పిన మంచి విష్ణు ఆ వెంట‌నే వ్యక్తిగ‌త విష‌యాల‌తో పాటు ఇండస్ట్రీకి సంబంధించిన అనేక విష‌యాల‌పై చ‌ర్చించామ‌ని, అయితే వాటి గురించి తాను చెప్ప‌న‌ని స్ప‌ష్టం చేశాడు. అంతే కాకుండా ఇటీవ‌ల జ‌రిగిన ప్ర‌త్యేక భేటీకి త‌న తండ్రి మోహ‌న్ బాబుకు ఆహ్వానం లేకుండా చేశార‌ని, ఈ విష‌యంలో కొంత మంది అడ్డుప‌డ్డార‌ని, ఆ కార‌ణంగానే విష‌యం త‌న తండ్రి దాకా రాలేద‌ని బాంబు పేల్చాడు.

ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు మెగా భేటీతో త‌మ స‌మ‌స్య‌ల‌కు ఎండ్ కార్డ్ ప‌డ‌బోతోంద‌ని సంబ‌ర‌ప‌డుతు్న క్ష‌ణాన మంచు విష్ణు ఇలా కొత్త వాద‌న‌ని తెర‌పైకి తీసుకొచ్చి అస‌లు స‌మ‌స్యని ప‌క్క‌దారి ప‌ట్టించే ప్ర‌య‌త్నాలు చేయ‌డం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌ని విస్మ‌యానికి గురిచేస్తోంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇండ‌స్ట్రీ త‌రుపున మెగాస్టార్ తో పాటు స్టార్ హీరోలు - డైరెక్ట‌ర్ లు వెళ్లి స‌మ‌స్య‌ను ప‌రిష్కారించే ప్ర‌య‌త్నం చేస్తుంటే మంచు విష్ణు ఈగోల‌కు వెళ్లి ఇండైరెక్ట్ గా స‌మ‌స్య‌ను త‌ప్పుదారి ప‌ట్టించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని విమ‌ర్శిస్తున్నారు.

ఒక‌రు స‌మ‌స్య‌కు ప‌రిష్కారం వెతుకుతుంటే మ‌రొక‌రు వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాల కోసం ప్రాకులాడుతుండ‌టం   ఇండ‌స్ట్రీలో వున్న విభేధాల‌కు అద్దంప‌డుతోంద‌ని, రాజ‌కీయాల‌ని మించిన‌ పాలిటిక్స్ కి టాలీవుడ్ కేరాఫ్ అడ్ర‌స్ గా మారుతోంది. ఇప్ప‌టికైనా ఈ త‌ర‌హా పాలిటిక్స్ కి టాలీవుడ్ వ‌ర్గాలు ఫుల్ స్టాప్ పెట్టి మాట‌ల్లో మేమంతా ఒక‌ట‌ని కాకుండా చేత‌ల్లో మేమంతా ఒక‌ట‌ని నిరూపించి ఇండ‌స్ట్రీ బాగుకోసం పాటుప‌డితే మంచిద‌ని స‌గ‌టు ప్రేక్ష‌కుడితో పాటు ప‌లువురు ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి.

   
Tags:    

Similar News