హీరోల్ని రాచి రంపాన పెడుతున్న డైరెక్ట‌ర్

Update: 2020-02-14 15:30 GMT
హీరో ఎలాంటి వాడైనా.. త‌న‌కు కావాల్సిన విధంగా మ‌లుచుకుని అటుపై తాపీగా సెట్స్ కి వెళ్ల‌డం మ‌ణి ర‌త్నం స్టైల్‌. అందుకోసం చాలా స‌మ‌యం వెచ్చించాల్సి ఉంటుంది. ద‌శాబ్ధాల కెరీర్ లో ఎంద‌రో హీరోల్ని ఆయ‌న సాన‌బ‌ట్టారు. అర‌వింద స్వామి- మోహ‌న్ లాల్- సురేష్ గోపి- చియాన్ విక్ర‌మ్ - సూర్య‌- మాధ‌వన్- దుల్కార్ స‌ల్మాన్ - యంగ్ కార్తీక్ .. ఇలా ఎంద‌రో హీరోలు ఆయ‌న వ‌ద్ద న‌టన‌లో మెళుకువ‌ల్ని తెలుసుకున్నారు. ఆర్టిస్టుగా త‌మ‌ని తాము కొత్త‌గా ప్రెజెంట్ చేసుకునే స్కిల్ ని నేర్చుకున్నారు.

ఇప్పుడు కార్తీ- జ‌యం ర‌వి వంటి న‌వ‌త‌రం స్టార్ల‌కు ఆయ‌న శిక్షణ క‌ఠినంగానే ఉంద‌ని అర్థ‌మవుతోంది.  తాజాగా విమానాశ్ర‌యంలో చిక్కిన కోలీవుడ్ స్టార్లు కార్తీ- జయం రవి  కొత్త లుక్ చూడ‌గానే ఆ సంగ‌తి అర్థ‌మ‌వుతోంది. రొటీన్ కి భిన్నంగా ఆ ఇద్ద‌రూ పూర్తిగా మేకోవ‌ర్ ట్రై చేస్తున్నారు. తాజా మూవీ పొన్నియ‌న్ సెల్వ‌న్ లో స‌రికొత్త‌గా త‌మ‌ని తాము ప్రెజెంట్ చేసుకోబోతున్నారు. ప్ర‌స్తుతం మ‌ణిర‌త్నం  డ్రీమ్ ప్రాజెక్ట్ `పొన్నీయిన్ సెల్వన్` చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా సాగుతోంది. ఆ క్ర‌మంలోనే శుక్రవారం నాడు హైదరాబాద్ విమానాశ్రయంలో కనిపించారు. ఈ ఫోటోల్లో గుబురు గ‌డ్డం.. కోర‌ మీసాలు.. పొడ‌వాటి గిర‌జాల జుత్తుతో ఆ ఇద్ద‌రు హీరోలు స‌ర్ ప్రైజ్ చేశారు. ఇదో హిస్టారిక‌ల్ ఫిక్ష‌న్ మూవీ కావ‌డంతో గెట‌ప్పులు కాస్త వెరైటీగానే ఉన్నాయి. వందియాదేవన్ పాత్రలో కార్తీ న‌టిస్తున్నారు. చోళ రాజు రాజా రాజా చోళ పాత్ర లేదా  అరుణ్మోళి వర్మన్ పాత్ర‌లో జ‌యం ర‌వి న‌టిస్తున్నారని ఇంత‌కుముందు ప్ర‌చార‌మైంది. ఆ పాత్ర‌ల‌కు త‌గ్గ‌ట్టే గెట‌ప్పుల్ని మార్చేశారు.

ప్ర‌స్తుతం హైదరాబాద్‌లోనే షూటింగ్ జ‌రుగుతోంది. ఇందులో మాజీ విశ్వ‌సుంద‌రి ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఓ కీల‌క పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. చియాన్ విక్రమ్- త్రిష- మోహన్ రామ్- అర్జున్ కాకుమను- అశ్విన్ చిదంబరం- ఐశ్వర్య లక్ష్మి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ - మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పొన్నిన్ సెల్వన్ అభియూమ్ నానుమ్ ఫేమ్ కుమారవేల్ ఈ ప్రాజెక్టుకు సహ-రచయిత‌గా ప‌ని చేశారు. 2019 డిసెంబర్ 13 న థాయ్‌ లాండ్‌ లో ఈ సినిమాని ప్రారంభించారు. గ‌త ఏడాది ఈ సినిమాకి సంబంధించిన ప‌నుల్ని ప్రారంభించారు. హైద‌రాబాద్ షెడ్యూల్ త‌ర్వాత ఈ సినిమాలోని కొన్ని భాగాలను పాండిచేరిలో చిత్రీకరించ‌నున్నార‌ని తెలుస్తోంది.



Tags:    

Similar News