పూనమ్ సీరియస్.. 36 యూట్యూబ్ ఛానల్స్ పై కంప్లైంట్!

Update: 2019-04-18 06:36 GMT
హీరోయిన్ పూనమ్ కౌర్ బుధవారం నాడు 36 యూట్యూబ్ చానల్స్ పై హైదరాబాద్ లోని సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ లో కేసు ఫైల్ చేశారు.  తనపై అసత్య ప్రచారం చేస్తూ.. తప్పుడు కథనాలను పోస్ట్ చేస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.  పవన్ కళ్యాణ్ నిందిస్తూ తను మాట్లాడినట్టుగా చెప్తున్న ఫేక్ ఆడియో టేప్ లను యూట్యూబ్ లో సర్క్యులేట్ చేశారని ఆరోపించారు.

ఈ విషయంపై మీడియా ప్రతినిథులతో మాట్లాడుతూ "నాపై జరుగుతున్న ఈ ప్రచారం వెనక రాజకీయ కారణాలు ఉన్నాయి. ఒక మహిళను ఈవిధంగా కించపరచడంతో వారేమి సాధిస్తారో నాకు తెలియదు.  గత రెండేళ్ళుగా నేను పడిన వేదన వేరే ఏ మహిళకు కుడా ఎదురుకాకూడదు." అని వ్యాఖ్యానించారు. ఈ ఫిర్యాదుపై సైబర్ క్రైమ్ వింగ్ అడిషనల్ డిప్యూటీ కమీషనర్ రఘువీర్  స్పందిస్తూ పూనమ్ కౌర్ ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించి ఆ యూట్యూబ్ ఛానల్స్ పై కేసులు నమోదు చేశామని తెలిపారు. ఎంక్వయిరీ చేసి నిజానిజాలు తేలుస్తామని అన్నారు.  

పలు యూట్యూబ్ ఛానల్స్ వారు పవన్ కళ్యాణ్ ను పూనమ్ కౌర్ నిందిస్తున్నట్టుగా ఉన్న ఆడియో క్లిప్స్ ను ఎలెక్షన్స్ ముందు విపరీతంగా సర్క్యులేట్ చేశారు. ఆ ఆడియో క్లిప్స్ లో ఉన్న వాయిస్ పూనమ్ దో కాదో తెలియకుండానే పూనమ్ వాయిస్ అంటూ ప్రచారం సాగించారు.  మరి ఈ అంశంపై సైబర్ క్రైమ్ వారు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
Tags:    

Similar News