ఇండస్ట్రీ నన్ను బహిష్కరించినా భయం లేదు: పోసాని

Update: 2022-02-13 07:49 GMT
పోసాని కృష్ణమురళి అంటే ఆవేశం .. తెగింపు. తన కలంతో తెరపై పాత్రలతో ఎలా మాట్లాడిస్తారో బయట కూడా ఆయన అలాగే మాట్లాడతారు. ఎవరు ఎలా స్పందించినా మాటలదాడి చేయడానికి ఆయన వెనుకాడరు. సాధారణంగా ఇండస్ట్రీలో రచయితలు అందరికీ అనుకూలంగా ఉంటారు. ఎవరితో ఎలాంటి గొడవలు వచ్చినా ఇక అవకాశాలు రావడం కష్టమే.

అందుకే ఇక్కడ ఉండాలంటే సర్దుకుపోవాలి .. లేదంటే ఇంటికి వెళ్లి సామాన్లు సర్దుకుని పోవాలి అంతే. ఈ విషయంపై అందరికీ పూర్తి క్లారిటీ ఉంటుంది. అందువల్లనే మౌనంగా ఎవరి పనులను వారు చక్కబెడుతుంటారు.

అయితే పోసాని మాత్రం అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తారు. తాను చెప్పదలచుకున్న విషయాలను నిర్భయంగా చెప్పేస్తుంటారు. అనవలసిన మాటలను అనేస్తుంటారు. అందుకు పర్యవసానాలను ఎదుర్కోవడానికి కూడా ఆయన సిద్ధంగా ఉంటారు. అలా ఆ మధ్య ఒక వివాదంలో చిక్కుకున్న ఆయన, ఆ తరువాత చాలా రోజుల పాటు ఎక్కడా కనిపించలేదు. కొంతకాలం క్రితం పోసాని చేసిన ఆరోపణల కారణంగా ఆయనకి అవకాశాలు ఇవ్వడానికి చాలామంది ఆసక్తిని చూపడం లేదని చెప్పుకున్నారు.

పోసానిపై అనధికారిక బ్యాన్ పెట్టడం కూడా జరిగిపోయిందనే ప్రచారం జరిగింది. ఇకపై ఆయనకి సినిమాల్లో అవకాశాలు రావడం కష్టమేనని అనుకుంటున్నారు. నిన్న రాత్రి జరిగిన 'సన్ ఆఫ్ ఇండియా' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పోసాని ఈ విషయాన్ని గురించే ప్రస్తావించాడు.

తనకి మాత్రమే కాదు తనకి ముందున్న గొప్ప రచయితలెవరికీ సరైన గుర్తింపు .. గౌరవం దక్కలేదనే విషయాన్ని గురించి మాట్లాడారు. వారందరి జీవితాలను గురించి తనకి తెలుసునని అన్నారు. గొప్ప గొప్ప రచయితలను ఇండస్ట్రీ ఎంత దూరం పెట్టిందో తాను చూశానని చెప్పారు.

ఇండస్ట్రీని చాలా దగ్గరగా చూడటం వలన తనకి చాలా విషయాలు అర్థమయ్యాయనీ, అందువలన ఆ రచయితల మాదిరిగా తాను బతకాలనుకోవడం లేదని అన్నారు. ఆ రచయితలందరికీ ఎలా బతకాలో తెలియదనీ, తాను మాత్రం కాస్త ముందుచూపుతో తన పిల్లల పిల్లలకు కూడా ఢోకా లేకుండా సంపాదించుకున్నాని చెప్పారు. అందువలన ఇండస్ట్రీ నుంచి  ఇక తాను ఏమీ ఆశించడం లేదనీ, ఇక ఇండస్ట్రీ ఏది ఇచ్చినా అది బోనస్ అవుతుందని అన్నారు. ఇక ఇండస్ట్రీ తనని దూరం పెట్టినా తనకి వచ్చే కష్టం .. నష్టం ఏమీ లేదనే విషయాన్ని పోసాని తేల్చి చెప్పేశారు.
Tags:    

Similar News