ప్ర‌భాస్ మోష‌న్ కాప్చ‌ర్ సినిమాల‌కు పెను స‌వాల్‌

Update: 2022-12-20 03:38 GMT
2022 మోస్ట్ అవైటెడ్ హాలీవుడ్ విజువల్ సంచ‌ల‌నం 'అవతార్- ది వే ఆఫ్ వాటర్' ప్ర‌పంచ దేశాల‌తో పాటు భార‌త‌దేశంలో అత్యంత భారీగా విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా తొలి రెండు రోజుల్లోనే భార‌త‌దేశంలో 100 కోట్లు వ‌సూలు చేసింద‌ని ట్రేడ్ చెబుతోంది. తెలుగు వెర్షన్ లో కూడా డిసెంబర్ 16న ఏకకాలంలో విడుదలైన సంగ‌తి తెలిసిందే. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం..జేమ్స్ కామెరూన్ సినిమా క్రియేషన్ మొదటి వారాంతంలో జంట తెలుగు రాష్ట్రాల నుండి రూ. 23.35 కోట్ల షేర్ ను వ‌సూలు చేసింది.

ఏరియా వైజ్ క‌లెక్ష‌న్లు ప‌రిశీలిస్తే.. నైజాం 12.57 కోట్లు.. సీడెడ్ 3.04 కోట్లు .. ఉత్తరాంధ్ర 3.31 కోట్లు...తూ.గో-ప.గో 1.18 కోట్లు.. కృష్ణా-గుంటూరు 2.43 కోట్లు..నెల్లూరు 0.82 కోట్లు వ‌సూలు చేసింది. AP/TS గ్రాండ్ టోట‌ల్ 23.35 కోట్లు గా ఉంద‌ని ట్రేడ్ చెబుతోంది.  మొత్తం ఆంధ్ర- రాయలసీమ- నైజాంలో అవతార్ 2 ప్రీ-రిలీజ్ బిజినెస్ కేవలం 5 కోట్ల రూపాయలకు జరిగింది. కొన్ని ఏరియాల్లో సినిమా అద్దె ప్రాతిపదికన విడుదల కాగా చాలా ఏరియాల్లో షేర్ బేసిస్ విడుదలైందని క‌థ‌నాలొచ్చాయి. జంట తెలుగు రాష్ట్రాల కోసం అవతార్ 2 బ్రేక్-ఈవెన్ టార్గెట్ రూ.5.25 కోట్లు. కానీ ఈ సినిమా ప్రారంభ వారాంతంలో రూ.23.35 కోట్ల షేర్ వసూలు చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే భారీ లాభాలను ఆర్జించింద‌ని స‌మాచారం.

పెను స‌వాల్ ని స్వీక‌రిస్తారా?

అవతార్ 2 ప్రభావం ఇప్పుడు వీ.ఎఫ్.ఎక్స్ బేస్డ్ సినిమాల‌పై తీవ్ర ప్ర‌భావం చూప‌నుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ది వే ఆఫ్ వాట‌ర్ 3డి విజువ‌ల్ ట్రీట్ ప్రేక్ష‌కుల మ‌న‌సుపై ఘాడ‌మైన ముద్ర వేసింది. సాంకేతిక‌త‌లో ఇప్ప‌టివ‌ర‌కూ ప్ర‌పంచ సినీచ‌రిత్ర‌లోనే ది బెస్ట్ అని నిరూపించిన సినిమాగా టాక్ వినిపించింది. జేమ్స్  కామెరాన్ నైపుణ్యానికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా క్రిటిక్స్ తో పాటు ప్ర‌జ‌లు జేజేలు ప‌లికారు. సినిమాల నిర్మాణంలో సాంకేతిక అంశాలను కొత్త పుంతలు తొక్కించ‌డంలో అత‌డి ప్ర‌త్యేక‌తే వేరు. 'అవతార్2' 3డి అద్భుతమైన విజువల్స్ తో మాయాజాలం సృష్టించిందని ప్రశంసలు అందుకుంటోంది. సినిమా నిడివి ల్యాగ్ ఉన్నా స్పెషల్ ఎఫెక్ట్స్ కారణంగా ప్రేక్షకులు పూర్తిగా స‌రికొత్త ప్ర‌పంచంలో విహ‌రిస్తున్న అనుభూతిని పొందుతున్నారు.

'అవతార్'లో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ కూడా అత్యాధునిక విధానంలో ఉప‌యోగించార‌ని కూడా తెలుస్తోంది. అయితే దీని ప్ర‌భావం భ‌విష్య‌త్ లో భార‌త్ లో తెర‌కెక్కే మోష‌న్ కాప్చ‌ర్ సినిమాల‌పై తీవ్రంగా ప‌డ‌నుంది. ఇక‌పై భార‌తీయ ఆడియెన్ క‌చ్ఛితంగా ఇలాంటి అద్భుత విజువ‌ల్స్ ని మాత్ర‌మే కోరుకుంటారు. డమ్మీ గ్రాఫిక్స్ తో అంత‌గా నాణ్య‌త లేని వీఎఫ్‌.ఎక్స్ తో సినిమాలు వ‌స్తే ఆద‌ర‌ణ పొంద‌డం దాదాపు అసాధ్యం అని విశ్లేషిస్తున్నారు.

ఆ రకంగా చూస్తే ప్ర‌స్తుతం ప్ర‌భాస్ న‌టిస్తున్న రెండు భారీ పాన్ ఇండియా సినిమాల‌కు ఇది స‌వాల్ గా మార‌నుంది. ఇందులో నాగ్ అశ్విన్ తెర‌కెక్కిస్తున్న సైన్స్ ఫిక్ష‌న్ మాయా ప్ర‌పంచం 'ప్రాజెక్ట్ కే' సాంకేతిక‌త‌లో ది బెస్ట్ అని నిరూపించాల్సి ఉంటుంది. ఇది హాలీవుడ్ త‌ర‌హాలో యూనివ‌ర్శ‌ల్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న భారీ చిత్రంగా ప్ర‌చారం ఉంది. దానికి త‌గ్గ‌ట్టే వీఎఫ్ ఎక్స్ వ‌ర్క్ లో నాణ్య‌త‌ను చిత్ర‌బృందం ప్ర‌ద‌ర్శించాల్సి ఉంటుంది. అలాగే ప్రభాస్ - కృతి సనన్ ల‌తో ఓంరౌత్ రూపొందిస్తున్న తాజా చిత్రం 'ఆదిపురుష్' మోషన్ క్యాప్చర్ విధానంలోనే తెర‌కెక్కుతోంది. అందువ‌ల్ల ఈ సినిమా అత్యుత్త‌మ విజువ‌ల్స్ తో క‌ట్టి ప‌డేస్తేనే జ‌నం థియేట‌ర్ల‌కు వ‌స్తారు. ఎక్క‌డ నాశిర‌కం విజువ‌ల్స్ క‌నిపించినా వెంట‌నే దానిపై మీమ్స్ సెటైర్లు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతాయి. ఇప్ప‌టికే టీజ‌ర్ తో బోలెడ‌న్ని విమ‌ర్శ‌ల్ని మూట‌గ‌ట్టుకున్న ఈ చిత్రంలో యాధృచ్ఛికంగా అయినా అవ‌తార్ లుక్ కి స్ఫూర్తినిచ్చిన శ్రీ‌రాముడి రూపంలో ప్ర‌భాస్ క‌నిపించ‌నున్నారు. ఇది మ‌రింత ప్ర‌మాద‌క‌రంగా మారుతుంద‌ని కూడా అంచ‌నా వేస్తున్నారు.

'ఆదిపురుష్' టీజర్ కు ప్రతికూల స‌మీక్ష‌లు రావ‌డంతో సినిమా విడుదల తేదీని వాయిదా వేసేందుకు కార‌ణ‌మైంద‌ని విశ్లేషించారు. విజువ‌ల్ గా మ‌రింత నాణ్య‌మైన ప‌ని కోసం వెనక్కి త‌గ్గార‌ని కూడా టాక్ వినిపించింది. భారతీయ సినీ ప్రేక్షకులు 'అవతార్ 2' మాయా ప్ర‌పంచంతో మ‌మేక‌మ‌వ్వ‌డంతో ఇది పెను స‌వాల్ గా మారింది. అందుకే దర్శకులు నాగ్ అశ్విన్... ఓం రౌత్ వంటి వాళ్ల‌కు ఇది హెచ్చ‌రిక‌గా చూడాలి. ఒత్తిడిని అధిగమించి మ‌రింత బెట‌ర్ విజువ‌ల్స్ కోసం వీరంతా ప్ర‌య‌త్నించాల్సి ఉంటుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News