విల్‌స్మిత్ కే దిక్కులేదు.. ప్ర‌భుదేవాని చూస్తారా?

Update: 2022-06-20 11:53 GMT
జీనీ మాయాజాల క‌థ‌ల‌కు ఉభ‌య తెలుగు రాష్ట్రాల ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టిన సంద‌ర్భాలున్నాయి. అరేబీయ‌న్ నైట్స్ క‌థ‌ల్లో జీని  పాత్రకు మంచి ప్ర‌త్యేక‌త వుంద‌న్న‌ది తెలిసిందే. ఈ పాత్ర నేప‌థ్యంలో ఇప్ప‌టి వ‌ర‌కు చాలా సినిమాలొచ్చాయి. అందులో చాలా వ‌ర‌కు స‌క్సెస్ సాధించాయి కూడా. కానీ ప్ర‌స్తుతం ఈ త‌ర‌హా సినిమాకు ఏమంత‌గా ఆద‌ర‌ణ ద‌క్క‌డం లేదు. 2019లో హాలీవుడ్ పాపుల‌ర్ స్టార్ విల్ స్మిత్ జీనీ పాత్ర‌లో న‌టించిన చిత్రం 'అల్లాద్దీన్‌'.  

మేన మ‌స్సూద్‌, న‌వోమీ స్కాట్ ప్ర‌ధాన జంట‌గా న‌టించారు. అత్యంత భారీ బ‌డ్జెట్ తో గ్రాఫిక్స్ మాయాజాలంగా నిర్మించి ఈ మూవీని ఇంగ్లీష్ తో పాటు తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లోనూ విడుద‌ల చేశారు. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ మూవీ తెలుగు వెర్ష‌న్ కు సంబంధించిన విల్ స్మిత్ పాత్ర‌కు స్టార్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్ డ‌బ్బింగ్ చెప్పారు. అయినా ఈ మూవీని బాక్సాఫీస్ వ‌ద్ద కాపాడ‌లేక‌పోయారు.

ప్ర‌ఖ్యాత హాలీవుడ్ సంస్థ వాల్ట్ డిస్నీ పిక్చ‌ర్స్ ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో నిర్మించింది. అయినా ఈ మూవీ ప్రేక్ష‌కుల్ని ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయింది. మ‌ళ్లీ ఇదే జీనీ పాత్ర‌ని ప్ర‌స్తుతం ప్ర‌భుదేవా చేస్తున్నారు. ఆయ‌న న‌టిస్తున్న మూవీ 'మైడియ‌ర్ భూతం'. ప్ర‌భుదేవా జీనీ భూతంగా న‌టించిన ఈ మూవీని ఎన్‌. రాఘ‌వ‌న్ రూపొందించారు. త‌మిళంతో పాటు ఈ మూవీ తెలుగులోనూ భారీ స్థాయిలో విడుద‌ల కానుంది.

ద‌ర్శ‌కుడిగా ఈ మ‌ధ్య వ‌రుస ఫ్లాపుల్లో వున్న ప్ర‌భుదేవా ఈ మూవీతో తొలి సారి జీనీగా న‌టిస్తున్నారు. ర‌మ్యా నంబీస‌న్‌, అశ్వంత్, ప‌రం గుహ‌నేష్ , సాత్విక్, శ‌క్తి త‌దిత‌రులు నటిస్తున్నారు. ప్ర‌భుదేవా జీనీ పాత్ర‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ని మేక‌ర్స్ తాజాగా విడుద‌ల చేశారు. ఈ పాత్ర కోసం ప్ర‌భుదేవా బాగానే శ్ర‌మించిన‌ట్టున్నారు. లుక్ మాతంరం చాలా ఇంట్రెస్టింగ్ గా వుంది. తెలుగులో శ్రీ‌ల‌క్ష్మీ బాలాజీ  క్రియేష‌న్స్ పై ఏ.ఎన్ బాలాజీ అందిస్తున్నారు.

త్వ‌ర‌లోనే రిలీజ్ డేట్ ని నిర్ణ‌యించ‌నున్న ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకుంటుందా? .. గ‌త చిత్రాల‌కు మించి ఈ మూవీలో స్పెష‌ల్ అంటూ ఏముంది?

ఏదో ఓ ప్ర‌త్యేక‌త‌తో తెర‌కెక్కిస్తేనే ఈ త‌ర‌హా సినిమాకు ఆద‌ర‌ణ ద‌క్కుతుంది. మ‌రి ఈ నేప‌థ్యంలో జీనీగా ప్ర‌భుదేవా ఆక‌ట్టుకుంటాడా?  లేదా? అన్న‌ది తెలియాలంటే ఈ మూవీ రిలీజ్ వ‌ర‌కు వేచి చూడాల్సిందే. ఈ సినిమాకు సంగీతం డి. ఇమాన్‌, ఫొటోగ్ర‌ఫీ యూకె. సెంథిల్ కుమార్‌.
Tags:    

Similar News