ప్రకాష్ రాజ్.. తెలుగు పాండిత్యం కథ అదీ

Update: 2017-12-17 11:21 GMT
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నేపథ్యం తెలియని వాళ్లు ఆయన మాట వింటే తెలుగువాడే అనుకుంటారు. అంత చక్కగా తెలుగులో మాట్లాడతాడు ప్రకాష్ రాజ్. కేవలం తెలుగులో మాట్లాడటమే కాదు.. తెలుగు సాహిత్యం గురించి.. ఇక్కడి రచయితల గురించి.. మన వాళ్ల కంటే మిన్నగా.. అనర్గళంగా ప్రసంగిస్తాడు ప్రకాష్ రాజ్. స్వతహాగా కన్నడిగుడు అయిన ప్రకాష్ రాజ్.. తెలుగుపై ఇంత పట్టు సాధించడం.. ఇంత బాగా మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తుంది. మరి ప్రకాష్ అంతగా తెలుగుపై ఎలా పట్టు సాధించాడు.. మిగతా పరభాషా నటుల్లాగా డబ్బింగ్ తో నెట్టుకురాకుండా తెలుగు ఎందుకు నేర్చుకున్నాడు.. ఈ విషయాల్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారాయన.

‘‘నేను తెలుగులో నటించిన తొలి సినిమా ‘సంకల్పం’లో నా పాత్రకి వేరే డబ్బింగ్ ఆర్టిస్టుతో డబ్బింగ్ చెప్పించారు. ఐతే చెన్నైలోని ఓ స్డూడియోలో డబ్బింగ్‌ జరుగుతుంటే అక్కడికి వెళ్లాను. డబ్బింగ్ ఆర్టిస్టుకు నేను కొన్ని కరెక్షన్లు చెబుతుంటే అక్కడున్నవాళ్లు విసుక్కున్నారు. నాకు చాదస్తం ఎక్కువన్నారు. డబ్బింగ్ విషయంలో అంత బాధగా ఉంటే.. పూర్తిగా తెలుగు నేర్చుకుని రా అన్నారు. చాలా బాధేసింది. అప్పుడే ఇకపై నా గొంతు నేనే వినిపించాలనుకున్నా. తనికెళ్ల భరణి.. సీతారామశాస్త్రి.. కృష్ణవంశీ లాంటి వాళ్ల స్నేహం నాకు కలిసొచ్చింది. ముందు నా అంతట నేను తెలుగు రాయడం.. మాట్లాడటం నేర్చుకున్నా.  తర్వాత మంచి పుస్తకాలు చెప్పమని అడిగితే.. భరణి - ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఇద్దరూ నా చేతిలో చలం గారి ‘మైదానం’ పెట్టారు. అక్కడి నుంచి నా సాహితీ ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత ‘మహాప్రస్థానం’ సహా ఎన్నో పుస్తకాలు చదివాను. భాషపై పట్టు సాధించాను’’ అని ప్రకాష్ రాజ్ తెలిపాడు.
Tags:    

Similar News