మంచి సినిమా కోసం కదులుతారా?

Update: 2016-10-10 09:30 GMT
ఎంతో కష్టపడి.. ఇష్టపడి తీసిన ఒక సినిమా ఆడనపుడు కలిగే బాధ అంతా ఇంతా కాదు. అందులోనూ ఆ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కినా.. ప్రేక్షకాదరరణకు నోచుకోకపోతే.. పెట్టిన పెట్టుబడి తిరిగి రాకపోతే ఆ దర్శక నిర్మాతలకు తీవ్ర ఆవేదన చెందుతారు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ ఈ పరిస్థితిలోనే ఉన్నాడు. దర్శకుడిగా మొదట్నుంచి మంచి సినిమాలే తీస్తూ వస్తున్నాడు ప్రకాష్ రాజ్. ఆయన ఇంతకుముందు తీసిన మూడు సినిమాల్లో ‘ధోని’ ఆణిముత్యం లాంటి సినిమా. పిల్లల అభిరుచుల్ని అర్థం చేసుకుని తల్లిదండ్రులు వారిని ఎలా ప్రోత్సహించాలో హృద్యంగా చెప్పాడు ప్రకాష్ రాజ్. కానీ ఆ సినిమా ఆదరణకు నోచుకోలేదు. ‘ఉలవచారు బిర్యాని’ సంగతి వేరు. దాన్ని పక్కనబెట్టేద్దాం.

ప్రకాష్ రాజ్ తాజా సినిమా ‘మనవూరి రామాయణం’ కొంచెం అప్ అండ్ డౌన్స్ తో సాగినప్పటికీ ఓవరాల్ గా మంచి సినిమా. కానీ రాంగ్ టైమింగ్‌ లో రిలీజవడం వల్ల ఈ సినిమా దెబ్బ తింది. ఐతే ఆ ఒక్క విషయాన్ని చూపించి వదిలేయడానికి లేదు. మంచి సినిమాలు రావట్లేదని బాధపడే వాళ్లు.. అభిరుచి ఉన్న ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఏమాత్రం ఆదరిస్తున్నారన్నది ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్న. ఇలాంటి సినిమాలు నచ్చే ప్రేక్షకులందరూ చూసినా ‘మనవూరి రామాయణం’ బాక్సాఫీస్ జర్నీని సునాయాసంగానే దాటేస్తుంది. కానీ అదే జరగలేదు. ఎంతో కమిట్మెంట్ తో సినిమా తీసిన ప్రకాష్ రాజ్.. విడుదల తర్వాత సినిమా పరిస్థితి చూసి ఆవేదనతో ఇలాంటి మంచి సినిమా చూడండి అని ఒక మెసేజ్ పెట్టాడంటే.. అంతకంటే బాధాకరమైన విషయం మరొకటి ఉండదు. ఇది ఒకరకంగా మంచి సినిమాను కోరుకునే వాళ్లందరూ సిగ్గుపడి.. ముందుకు కదలాల్సిన తరుణం. ఇప్పటికైనా మించి పోయింది లేదు. ఇప్పటికైనా అభిరుచి ఉన్న ప్రేక్షకులందరిలోనూ కదలిక రావాలి. ఇలాంటి మంచి సినిమాను ఆదరించి.. ప్రకాష్ రాజ్ లాంటి దర్శకుల్ని ప్రోత్సహించాలి.
Full View


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News