ఆల్ రౌండ‌ర్ చేరిక‌తో `స‌లార్` పూన‌క‌మే

Update: 2022-03-08 15:32 GMT
పృథ్వీరాజ్ సుకుమారన్.. అంత‌గా ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు ఇది. మాలీవుడ్ టు టాలీవుడ్ అత‌డు తెలియ‌ని వారుండ‌రు. పృథ్వీరాజ్ మాలీవుడ్ లో ఆల్ రౌండ‌ర్ గా వెలిగిపోతున్నాడు. హీరోగా ర‌చ‌యిత‌గా ద‌ర్శ‌కుడిగా అత‌డి ప్ర‌జ్ఞా పాట‌వాల గురించి ఎంత చెప్పినా త‌క్కువే. అత‌డు న‌టించిన చాలా సినిమాలు తెలుగులో అనువాద‌మై విడుద‌ల‌య్యాయి.

ఇంత‌కుముందు `లూసీఫీర్` లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మోహ‌న్ లాల్ న‌టించిన ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించింది. ఇందులో పృథ్వీరాజ్ ఒక కీల‌క పాత్ర‌ను పోషించ‌డ‌మే గాక ద‌ర్శ‌కుడిగానూ స‌త్తా చాటారు. మోహ‌న్ లాల్ న‌టించిన `బ్రో డాడీ` చిత్రానికి కూడా పృథ్వీరాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. అందులో అత‌డు ఓ కీల‌క‌పాత్ర‌ను కూడా పోషించాడు.

ఓవైపు హీరోగా న‌టిస్తూనే మ‌రోవైపు ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌గా.. నిర్మాత‌గా.. స‌త్తా చాటుతున్న అత‌డు భారీ పాన్ ఇండియా చిత్రాల్లో కీల‌క పాత్ర‌ల‌కు అంగీక‌రిస్తున్నాడు. తాజాగా పృథ్వీరాజ్ త‌న స‌లార్ చిత్రంలో న‌టిస్తున్నార‌ని రాధేశ్యామ్ ప్ర‌మోష‌న్స్ లో ప్ర‌భాస్ క‌న్ఫామ్ చేశారు. అలాగే పృథ్వీరాజ్ చేరిక‌పై స‌లార్ చిత్ర‌బృందం కూడా వేరొక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్న భారీ యాక్ష‌న్ చిత్రం స‌లార్ కి మ‌రో స‌త్తా ఉన్న స్టార్ యాడ‌య్యాడ‌ని టీమ్ వెల్ల‌డించింది.

అయితే ఈ చిత్రంలో పృథ్వీరాజ్ పాత్ర ఎలా ఉంటుంది? అన్న‌ది మాత్రం రివీల్ చేయ‌లేదు. అత‌డు కేవ‌లం అతిథి పాత్ర‌లో క‌నిపిస్తాడా లేక పూర్తి స్థాయి కీల‌క పాత్ర‌నే చేస్తున్నాడా? అన్న‌ది తెలియాలంటే కాస్త ఆగాల్సిందే. మ‌రోవైపు పృథ్వీరాజ్ న‌టించిన జ‌గ‌గ‌ణ‌మ‌న ఎంతో క్రేజీగా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.
Tags:    

Similar News