​ట్రంప్ అంటే నో భయమన్న మన హీరోయిన్

Update: 2017-01-20 05:13 GMT
నోటి నుంచి వచ్చే మాటతో కొన్నిసార్లు పేరుప్రఖ్యాతులు ఎలా వస్తాయో.. లేనిపోని తిప్పలు తెచ్చి పెడుతుంటాయి. తాజాగా బాలీవుడ్ భామ.. ఈ మధ్యనే హాలీవుడ్ రంగ ప్రవేశం చేసి తన మార్క్ ను చూపిస్తున్న ప్రియాంక చోప్రా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ మరికాసేపట్లో ప్రమాణస్వీకారం చేస్తున్న వేళ.. ఆమె నోటి నుంచి వచ్చిన మాటలు ఆమె ఇమేజ్ ను మరింత పెంచేశాయని చెప్పాలి.

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ కొలువు తీరుతున్న సమయంలో ఓపక్క విమర్శలు.. ఆగ్రహం వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో మరికొందరు ట్రంప్ లాంటి వ్యక్తి పెద్దన్న పదవిని చేపడితే ఇంకేమైనా ఉందా? అంటూ హడలిపోతున్న పరిస్థితి. మొత్తంగా ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టటంపై ఆందోళనలు వ్యక్తం చేస్తున్న వారే ఎక్కువ.

ఇలాంటి వేళ ఒక జర్నలిస్ట్ ప్రియాంకను ఆసక్తికర ప్రశ్నను సంధించారు. మీరుట్రంప్ ను చూసి భయపడుతున్నారా? అని అడిగితే దానికి బదులిచ్చిన ప్రియాంక.. ‘‘నేను భారతీయురాలిని. భయపడను’’ అంటూ వ్యాఖ్యానించేసరికి సదరు విలేకరి నోట మాట రాలేదు. ప్రియాంక నోటి నుంచి వచ్చిన సమాధానం అందరి దృష్టిని ఆకర్షించటమే కాదు.. చర్చగా మారింది. పేరుకు హీరోయిన్ అయినా... హీరోలా సమాధానం ఇచ్చిందన్న వ్యాఖ్య వినిపిస్తోంది. మరికొందరు ఒక అడుగు ముందుకేసి.. ప్రియాంక మాటలపై ట్రంప్ సైతం రియాక్ట్ అయ్యే అవకాశంఉందని చెబుతున్నారు. అదే జరిగితే.. ఆయన స్పందన ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News