దూరదర్శిని.. 90ల నాటి ప్రేమను గుర్తుచేస్తూ..
ప్రేమకు కాలంతో సంబంధం లేకున్నా, కొన్ని ప్రేమ కథలు మాత్రం చరిత్రలో చెరిగిపోని గుర్తులుగా నిలుస్తాయి.
ప్రేమకు కాలంతో సంబంధం లేకున్నా, కొన్ని ప్రేమ కథలు మాత్రం చరిత్రలో చెరిగిపోని గుర్తులుగా నిలుస్తాయి. అలాంటి కథతోనే ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది దూరదర్శిని సినిమా. "దూరదర్శిని - కలిపింది ఇద్దరిని" అనే ట్యాగ్ తో రూపొందుతున్న ఈ చిత్రం 90ల నాటి నేపథ్యంలో ఒక భిన్నమైన ప్రేమ కథను ప్రేక్షకులకు అందించబోతోంది. ఈ చిత్రంలో హీరోగా సువిక్షిత్ బోజ్జా, హీరోయిన్‌గా గీతికా రతన్ నటిస్తుండగా కార్తికేయ కొమ్మీ దర్శకత్వం వహిస్తున్నారు.
వరాహా మూవీ మేకర్స్ బ్యానర్‌పై బి. సాయి ప్రతాప్ రెడ్డి, జయ శంకర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇక ఈ చిత్రం ఒక హృదయాన్ని హత్తుకునే ప్రేమ కథగా రూపుదిద్దుకుంటోంది. "దూరదర్శిని" పేరుతోనే 90ల కాలం గమనాన్ని అద్దం పట్టే ప్రయత్నం జరుగుతోంది. రిలీజ్ చేసిన టీజర్ లో బ్యాక్ గ్రౌండ్ ఆర్ట్ వర్క్ మంచి ఫీల్ ను కలిగిస్తోంది.
హరి - వాణి అనే సున్నితమైన క్యారెక్టర్స్ మధ్యలో సినిమా కథ ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు. ఇక ఆ తరువాత వచ్చే ఇబ్బందులు, ప్రేమలో ఉండే ఎమోషన్స్ ను హార్ట్ కు టచ్ అయ్యేలా చూపించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ టీజర్‌ను ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "ఈ చిత్రానికి హీరో సువిక్షిత్ చాలా కష్టపడి పని చేశాడు. జెమిని సురేశ్ ఈ చిత్రంపై ఎంతో అభిమానం వ్యక్తం చేస్తూ, మంచి విజయాన్ని సాధిస్తుందని నమ్మకంగా చెబుతూ వచ్చాడు. 90ల ప్రేమను గుర్తుచేసే ఈ చిత్రం ప్రతీ ఒక్కరికి అనుభూతి పంచుతుంది" అని అన్నారు.
ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించిన జెమిని సురేష్ మాట్లాడుతూ, "ఈ సినిమా నా కెరీర్‌లో ప్రత్యేకమైనది. 90ల కాలాన్ని అద్దం పట్టేలా దర్శకుడు అద్భుతంగా చిత్రీకరించాడు. ప్రేక్షకులను వారి స్వంత ప్రేమ కబుర్లకు తీసుకెళ్లే విధంగా ఈ కథ రూపుదిద్దుకుంది" అని వెల్లడించారు. సినిమాలో వాణి పాత్రలో నటిస్తున్న గీతికా రతన్ మాట్లాడుతూ, "ఈ చిత్రం 90ల నాటి స్వచ్ఛమైన ప్రేమను ఆవిష్కరించేలా రూపొందించబడింది. హరి, వాణి మధ్య ప్రేమకథ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఈ ప్రాజెక్టులో భాగం కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను" అని తెలిపారు.
హరి పాత్ర పోషిస్తున్న సువిక్షిత్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, "90ల కాలాన్ని అద్దం పట్టేలా ఈ కథ నడుస్తుంది. ఇది ప్రతి ఒక్కరు వారు జీవించిన అనుభవాలను గుర్తు చేసుకునేలా ఉంటుంది. పాత్రలు, లొకేషన్లు అన్ని సహజంగా ఉండేలా డిజైన్ చేశాం. ఈ చిత్రంలోని భావోద్వేగాలు ప్రతీ ఒక్కరినీ కదిలిస్తాయి" అని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. సినిమాలో ముఖ్య పాత్రలు పోషించిన ఇతర నటీనటులు, టెక్నీషియన్లు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు. సంగీత దర్శకుడు ఆనంద్ గుర్రన్ అందించిన బాణీలు ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తాయని చిత్రబృందం తెలిపింది. ప్రేక్షకులను 90ల కాలం మనస్సులోకి తీసుకెళ్లే ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ‘దూరదర్శిని’ అందించే అనుభవం ఎలాంటి గుర్తులను మిగిలిస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.