ఇప్పటిదాకా మనం అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు... నేత కార్మికుడు బలవన్మరణం పొందాడు... అనే వార్తలను మాత్రమే విన్నాం. అయితే ఇప్పుడు కొత్తగా సినిమాలు తీసేందుకు అప్పులు చేసి... ఆ అప్పులిచ్చిన ఫైనాన్సియర్లు వేధింపులకు గురి చేస్తుంటే.. వాటిని తాళలేక నిర్మాత ఆత్మహత్య చేసుకున్నాడు అని కూడా చదువుకోవాల్సిన దుస్థితి వచ్చేసింది. సినిమా లోకం రంగుల లోకంలానే కనిపించినా... అందులోనూ పుట్టెడు దుఃఖాలున్నాయని, వాటి వెనుక కూడా ఎన్నడూ వినని కన్నీటి గాథలున్నాయని ఇటీవలి కాలంలో ఆ రంగానికి చెందిన పలువురు కళాకారుల బాథలను చూసి చలించిపోయాం. అయితే ఆ సినిమా రంగానికే పెట్టుబడిదారుగా ఉన్న నిర్మాత కూడా అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడనే వార్త మాత్రం జీర్ణించుకోలేనిదేనని చెప్పక తప్పదు.
ఇప్పుడు ఇలాంటి ఘటన తమిళ సినీ రంగం కోలీవుడ్ లో సంచలనం రేకెత్తిస్తోంది. కోలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాత బి. అశోక్ కుమార్ ఫైనాన్సియర్ల వేధింపులు తాళలేక కాసేపటి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే... చెన్నైలోని అళ్వార్ తిరునగర్ లోని తన నివాసంలో అశోక్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. గత కొంత కాలం నుంచి సినీ రంగంలో కొనసాగుతున్న అశోక్ కుమార్ పలు చిత్రాలకు సహ నిర్మాతగానూ కొన్ని సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరించారు. అయితే ఈ క్రమంలో సినీ నిర్మాణం కోసం ఆయన పలువురి వద్ద అప్పులు తీసుకున్నారు. ఈ క్రమంలో ఆయన సినిమాలకు ఫైనాన్సియర్ గా వ్యవహరిస్తున్న వ్యక్తులు తమ డబ్బులు తిరిగివ్వాల్సిందిగా గత కొంతకాలంగా ఆయనను బెదిరిస్తున్నారట. ఇటీవలి కాలంలో ఈ బెదిరింపులు మరింతగా ముదిరినట్టు సమాచారం. ఈ కారణంగానే ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. అశోక్ కుమార్ ప్రముఖ నటుడు - దర్శకుడు - నిర్మాత శశికుమార్ కు బంధువు. శశికుమార్ నిర్మాణంలో తెరకెక్కిన ఇసన్, పొరలి సినిమాలకు అశోక్ కుమార్ సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు. వీరి నిర్మాణంలో తెరకెక్కిన కోడి వీరం ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉంది.
అశోక్ కుమార్ ఆత్మహత్య ఘటన కోలీవుడ్ ను షాక్ కు గురి చేసిందనే చెప్పాలి. విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు అశోక్ కుమార్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. అయితే ఇలాంటి సున్నితమైన విషయాలపై కాస్తంత వేగంగా స్పందించే యువ హీరో సిద్ధార్థ్... అశోక్ కుమార్ ఆత్మహత్యపై ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. * ఫైనాన్సియర్ ఒత్తిడి కారణంగా ఓ యువ కళాకారుడు మరణించటం బాధ కలిగించింది. తమిళ సినీరంగంలో ఇలాంటివి చాలా ఉన్నాయి. కానీ ప్రపంచం కేవలం పేరు - సక్సెస్ లను మాత్రమే గుర్తిస్తుంది. మొత్తం వ్యవస్థనే మార్చాల్సిన సమయం వచ్చింది. రైతైనా, దర్శకుడైనా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి రావటం దారుణం* అని సిద్ధార్థ్ తన ట్వీట్ లో పేర్కొన్నాడు.