ఎన్టీఆర్ డిజాస్టర్ సినిమాని రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన పునీత్..!

Update: 2021-10-29 15:30 GMT
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ శుక్రవారం హఠాత్మరణం చెందారు. జిమ్ లో వర్కౌట్స్ చేస్తుండగా ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు 46 ఏళ్ల అప్పూ. పునీత్ మరణ వార్తతో సినీ ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అభిమానులందరూ పవర్ స్టార్ మరణించారనే వార్త జీర్ణించుకోలేక పోతున్నారు. టాలీవుడ్ ప్రముఖులు కూడా పునీత్ మృతికి సంతాపం ప్రకటించారు.

తెలుగు చిత్ర పరిశ్రమతో పునీత్ రాజ్ కుమార్ కు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. టాలీవుడ్ డైరెక్టర్ చేతుల మీదుగా హీరోగా లాంచ్ చేయబడిన పునీత్.. ఎన్నో తెలుగు సినిమాలను కన్నడలో రీమేక్ చేసి హిట్స్ అందుకున్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా తెలుగులో డిజాస్టర్ అయిన ''ఆంధ్రావాలా'' సినిమాతో కూడా సక్సెస్ అందుకుని ఆశ్చర్యపరిచాడు. ఎన్టీఆర్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎలాంటి ఫలితం అందుకుందో తెలిసిందే. అలాంటి కథను కన్నడలో 'వీర కన్నడి' అనే పేరుతో రీమేక్ చేశారు.

టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేష్ 'వీర కన్నడి' చిత్రానికి దర్శకత్వం వహించారు. 2004లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఒక భాషలో ప్లాప్ అయిన కథను రీమేక్ చేయడం సాహసమే అనుకోవాలి. అందుకే ఆ సినిమా సక్సెస్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ మెహర్ - పునీత్ ఇద్దరూ కలిసి అందరి అంచనాలను తలక్రిందులు చేశారు. ఇందులో తండ్రీ, కొడుకుగా రెండు పాత్రల్లో పునీత్ రాజ్ కుమార్ మెప్పించారు. ఇలా పూరీ అందించిన రెండు కథలతోనూ ఆయన హిట్స్ అందుకున్నారు.

'ఆంధ్రావాలా' రీమేక్ తరువాత పునీత్ రాజ్ కుమార్ - మెహర్ రమేష్ కలిసి 'ఒక్కడు' చిత్రాన్ని రీమేక్ చేసి సూపర్ హిట్ అందుకున్నారు. అలానే 'అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి' 'రెడీ' 'దూకుడు' వంటి తెలుగు సినిమాలను ఆయన రీమేక్ చేసి కన్నడ ప్రేక్షకులను అలరించారు. ఇదే క్రమంలో కన్నడలో తన స్థాయిని పెంచుకుంటూ వచ్చారు. పునీత్ చివరిగా నటించిన 'యువరత్న' సినిమాని డబ్ చేసి తెలుగు సినిమాలకు పోటీగా భారీగా విడుదల చేశారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో కూడా పునీత్ పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అవుతారని భావిస్తున్న తరుణంలో హఠాత్మరణం చెంది ఈ లోకాన్ని విడిచారు.
Tags:    

Similar News