రేసులో వర్మ కన్నా ముందే పూరి

Update: 2018-04-07 11:37 GMT
గురు శిష్యులిద్దరికి ఒకేసారి టైం బాలేకపోవడం అంటే ఇదే అని చెప్పొచ్చు. ఒకపక్క వర్మ తన చార్మ్ కోల్పోయి నాగార్జున ఆఫీసర్ తో తిరిగి వచ్చే ప్రయత్నం చేస్తుంటే మరో పక్క పూరి జగన్నాధ్ కూడా తన ఉనికిని పూర్వ వైభవాన్ని మెహబూబా సినిమాతో తిరిగి తెచ్చుకునే ట్రైల్స్ లో ఉన్నాడు. సోమవారం ఉదయం పది గంటలకు తన ఆఫీసర్ టీజర్ రిలీజ్ చేస్తానని వర్మ ప్రకటించిన కాసేపటికే పూరి కూడా తన మెహబూబా టీజర్ అదే రోజు ఉదయం గంట ముందుగా అంటే తొమ్మిది గంటలకు విడుదల చేయబోతున్నాడు. నిజానికి ముందు డిసైడ్ చేసింది పూరినే. కాకపోతే వర్మ ప్రకటన ఫస్ట్ హై లైట్ అయ్యింది. ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరు టీజర్ తో మెప్పిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

ఒక రకంగా చెప్పాలంటే ఈ రెండు కూడా ఇద్దరు దర్శకులకు లైఫ్ అండ్ డెత్ లాంటివి. స్టార్ హీరోలు వర్మకు కాని పూరికి కాని అవకాశాలు ఇవ్వడం మానుకున్నారు. లేకలేక బాలయ్య ఇస్తే పైసా వసూల్ రూపంలో తన పాత ఫార్ములానే దట్టించి ఫ్లాప్ కొట్టాడు పూరి. అంతకు ముందు కన్నడ హీరోను పరిచయం తీస్తూ తీసిన రోగ్ తో పోలిస్తే కాస్త నయం అనిపించడం తప్ప పూరి-ఇడియట్ కాలం నాటి క్రియేటర్ పూరిలో మాయమయ్యాడు అన్నది మాత్రం వాస్తవం. ఇక వర్మ సంగతి సరేసరి. అమితాబ్ లాంటి బాలీవుడ్ హీరోలు తప్ప మనవాళ్ళు ఏనాడో వర్మకు దణ్ణం పెట్టేసారు. శివ ఇచ్చిన రెస్పెక్ట్ తోనో లేక తన మీద నమ్మకమో కాని వర్మకు ఆఫీసర్ రూపంలో నాగార్జున మంచి అవకాశం ఇచ్చాడు. దీన్ని వర్మ ఎంత వరకు నిలబెడతాడు అనేది సస్పెన్స్

మెహబూబా మే 11 విడుదల కానుండగా ఆఫీసర్ మే 25 వస్తుంది. అంటే సరిగ్గా రెండు వారాల గ్యాప్ ఉంటుంది. రేంజ్ పరంగా హీరో ఇమేజ్ పరంగా రెండు సినిమాల మధ్య చాలా వ్యత్యాసం ఉన్నప్పటికీ గురు శిష్యుల పోటీ కాబట్టి ఈ మాత్రం పోలిక రావడం సహజం.



Tags:    

Similar News