కాపీ ఆరోప‌ణ‌ల‌పై పూరి స్పంద‌న ఇదీ!

Update: 2019-07-25 08:34 GMT
`ఇస్మార్ట్ శంక‌ర్` స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్ లో పూరి బృందం బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో అన్ని న‌గ‌రాల్ని చుట్టేస్తూ ప్ర‌చారం హోరెత్తిస్తోంది టీమ్. మ‌రోవైపు ఈ ప్ర‌చారంలో ర‌క‌ర‌కాల వివాదాల గురించి ప్ర‌శ్న‌లు ఎదుర‌వుతున్నాయి. ఇస్మార్ట్ శంక‌ర్ క‌థ నాదేన‌ని.. పూరి కాపీ చేశార‌ని హీరో ఆకాశ్  మీడియా ముఖంగానే ఆరోపించారు క‌దా?  దానికి మీ స‌మాధాన‌మేంటి? అని విజ‌య‌వాడ స‌క్సెస్ మీట్ లో పూరిని ప్ర‌శ్నించింది మీడియా.

దానికి పూరి త‌న‌దైన శైలిలో స్పందించారు. ``ఆకాష్ కి నాకు ఏ సంబంధం లేదు.. నేనెప్పుడూ క‌ల‌వ‌లేదు.. ఏవో అలిగేష‌న్స్ వ‌స్తాయి క‌దా.. ఇవ‌న్నీ కామ‌న్..`` అని అన్నారు. అయితే ఆకాశ్ చెబుతున్న వెర్ష‌న్ వేరుగా ఉంది. నేను చాలా సార్లు పూరీని క‌లిసేందుకు ప్ర‌య‌త్నించాను. ఫోన్ లో సంప్ర‌దించేందుకు ట్రై చేశాను. కానీ పూరి ఫోన్ రింగ్ అయినా తీయ‌లేదు. మ‌ళ్లీ మ‌ళ్లీ ప్ర‌య‌త్నిస్తే స్విచ్ఛాఫ్ చేశార‌ని ఆరోపించారు. ఆ త‌ర్వాత ఆకాష్‌ పూరి (పూరి త‌న‌యుడు)కి ఫోన్ చేశాన‌ని .. పూరి మేనేజ‌ర్ ని క‌లిసి త‌న వ‌ద్ద ఉన్న ఆధారాల్ని చూపించాన‌ని అన్నారు. ఈ విష‌యంపై తెలుగు సినిమా నిర్మాత‌ల మండ‌లి అధ్యక్షుడు సి.క‌ళ్యాణ్ ని సంప్ర‌దించాన‌ని ఆకాశ్ తెలిపారు. పూరి టీమ్ స‌రిగా స్పందించ‌క‌పోతే చ‌ట్ట‌బ‌ద్ధంగా పోరాడ‌తాన‌ని ఆకాశ్ హెచ్చ‌రించారు.

ఆకాశ్ తెర‌కెక్కించిన 2016 హిట్ చిత్రం `నాన్ యార్` క‌థ‌ని కాపీ చేసి పూరి `ఇస్మార్ట్ శంక‌ర్` చిత్రాన్ని తీశార‌ని ఆకాశ్ ఆరోపించారు. దాదాపు 15 పైగా సీన్లు కాపీ చేశార‌ని ఆరోపించారు. అయితే స‌క్సెస్ మీట్ల‌లో వివాదాల గురించి మాట్లాడేందుకు పూరి ఏమాత్రం ఆస‌క్తిని క‌న‌బ‌ర‌చ‌డం లేదు. మ‌హేష్ పై చేసిన కామెంట్ గురించి ప్ర‌శ్నించినా పూరి స‌మాధానం దాట‌వేశారు. ఆకాశ్ ఆరోప‌ణ‌ల్లో నిజం ఎంత‌? అన్న‌ది ఫిలింఛాంబ‌ర్ వ‌ర్గాలే తేల్చాల్సి ఉంది.
Tags:    

Similar News