ఓటీటీలో అఖండ - పుష్ప ట్రీట్ షురూ?

Update: 2022-01-04 04:33 GMT
2021 ముగింపును ఘ‌నంగా చాటుకుంది తెలుగు సినీప‌రిశ్ర‌మ. హిందీ ప‌రిశ్ర‌మ‌కే సాధ్యం కానిది టాలీవుడ్ కి సాధ్య‌మైంది. ల‌వ్ స్టోరి - అఖండ‌- పుష్ప లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలు తీపి గుర్తులుగా మిగిలాయి. ఇక వీటిలో అఖండ 100కోట్ల క్ల‌బ్ లో చేర‌గా.. పుష్ప చిత్రం పాన్ ఇండియా కేట‌గిరీలో విడుద‌లై 300కోట్ల క్ల‌బ్ లో చేరింది. అయితే గత ఏడాది థియేటర్లలో విడుదలైన మూడు భారీ చిత్రాలు జనవరిలోనే ఓటీటీ వేదికగా రానున్నట్లు ప్ర‌చారం సాగుతోంది.

న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా న‌టించిన హ్యాట్రిక్ హిట్ చిత్రం అఖండ ఇదే నెలలోనే ఓటీటీలో విడుదల కానుంద‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. అఖండ మూడోవారంలోనూ చ‌క్క‌ని వ‌సూళ్ల‌ను సాధించిన సంగ‌తి తెలిసిందే. అలాగే శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా తెరకెక్కిన పెళ్లి సంద‌డి హాట్‌స్టార్‌ వేదికగా ఈ సినిమా జనవరి 14న విడుదల కానున్నట్లు తెలుస్తోంది. అయితే వీటిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

అలాగే పుష్ప - ది రైజ్ కూడా సంక్రాంతి ముందే అమెజాన్ ప్రైమ్ లో విడుద‌ల కానుంద‌ని ప్ర‌చారం సాగుతోంది. అల్లు అర్జున్ - ర‌ష్మిక జంట‌గా సుకుమార్ తెర‌కెక్కించిన ఈ మూవీ ఇప్ప‌టికీ విజ‌య‌వంతంగా హౌస్ ఫుల్ క‌లెక్ష‌న్ల‌తో థియేట‌ర్ల‌లో కొన‌సాగుతోంది.

ఓటీటీ పుకార్లను ఖండించిన పుష్ప నిర్మాత‌లు

`పుష్ప: ది రైజ్` బాక్స్ ఆఫీస్ వద్ద చ‌క్క‌ని వ‌సూళ్ల‌ను సాధిస్తున్నా ఓటీటీ రిలీజ్ అంటూ ప్ర‌చారం సాగ‌డం డ్యామేజ్ అని మైత్రి సంస్థ భావిస్తోంది. ఈ సినిమా బాలీవుడ్ థియేటర్లలో విడుదలైన 17 వ రోజు అత్యధిక కలెక్షన్లు నమోదు చేయడం విశేషం. ఇది 1 వ రోజు కంటే రెట్టింపు వ‌సూళ్ల‌ను తెచ్చింది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో వ‌చ్చేస్తుందంటూ పుకార్లు మొదలయ్యాయి. పుష్ప జనవరి 7 నుండి OTT స్ట్రీమింగ్ కోసం సిద్ధమవుతోందని ఉప్పందించ‌డంతో ఇది ప్ర‌స్తుత వ‌సూళ్ల‌కు గండి కొడుతుంద‌ని భావిస్తున్నారు.

దీనిని ఖండిస్తూ మైత్రీ మూవీ మేకర్స్ ఓ ప్ర‌క‌ట‌న వెలువ‌రించింది. పుష్ప ఫుల్ టైమ్ థియేట్రికల్ రన్ పూర్తయ్యే వరకు OTTలో విడుదల చేసేది లేదని ధృవీకరించింది. బాలీవుడ్ పుష్ప విడుదల తేదీ నుండి 50 రోజులలో అమెజాన్ ప్రైమ్ కు వెళ్లాలని వారు ఒప్పందం కుదుర్చుకున్నారని చెబుతున్నారు. అంటే ఫిబ్రవరిలో మాత్రమే OTT లో విడుద‌ల‌య్యేందుకు ఆస్కారం ఉంటుంది. కానీ సంక్రాంతి ముందే ఓటీటీలో రిలీజ‌వుతుంద‌న్న ప్ర‌చారం సాగుతోంది.

పుష్ప తెలుగు-త‌మిళం-మ‌ల‌యాళం-హిందీలో భారీగా విడుద‌లైంది. దేశ‌వ్యాప్తంగా చాలా థియేట‌ర్ల‌లో చ‌క్క‌ని వ‌సూళ్ల‌ను సాధిస్తోంది. బాక్సాఫీస్ వద్ద గోల్డెన్ రన్ కొనసాగిస్తోంది. చూస్తుంటే ఈ సినిమా సంక్రాంతి వ‌ర‌కూ ఇదే తీరుగా వ‌సూళ్ల‌ను తేవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.
Tags:    

Similar News