టైమ్ ట్రావెల్ కథపై కసరత్తు మొదలైందట!

Update: 2022-01-06 01:30 GMT
రాహుల్ సాంకృత్యన్ అనే పేరు వినగానే 'శ్యామ్ సింగ రాయ్' సినిమా గుర్తుకు వస్తుంది. ఎందుకంటే క్రితం నెల 24వ తేదీన థియెటర్స్ కి వెళ్లిన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను తన దూకుడు చూపుతోంది. ప్రపంచవ్యాప్తంగా 11 రోజుల్లో ఈ సినిమా 43.95 కోట్ల గ్రాస్ ను సాధించింది. అదే తెలుగు రాష్ట్రాల వరకే చూసుకుంటే, 32.06 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. ప్రతికూల పరిస్థితుల్లో ఈ సినిమా ఏ స్థాయి వసూళ్లను రాబట్టడం నిజంగా విశేషమేనని చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో రాహుల్ అనేక విషయాలను అభిమానులతో పంచుకున్నాడు.

"నేను ఈ కథను ముందుగా సితార బ్యానర్ వారికి వినిపించాను. నాని హీరోగా ఈ సినిమా చేయడానికి వారు అంగీకరించారు. ఆ తరువాత వారు బ్యాక్ స్టెప్ వేశారు. ఈ కథ 70వ దశకంలో నడుస్తుంది .. అది చూపించడానికి పెద్ద సెట్  వేయవలసి వస్తుంది .. అక్కడ ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది .. కాస్ట్యూమ్స్ పూర్తి డిఫరెంట్ గా ఉంటాయి. ఇంత పెద్ద కేన్వాస్ ఉన్న ఈ కథను ఈ దర్శకుడు డీల్ చేయగలడా? అనే సందేహం వారికి వచ్చిందేమో వెనకడుగు వేశారు. ఇక అదే సమయంలో వారు రెండు మూడు ప్రాజెక్టులతో బిజీగా ఉండటం కూడా కారణం కావచ్చునేమో.

అయితే సితార వారు తప్పుకున్న విషయం నానిగారు నన్ను పిలిచి చెప్పేవరకూ నాకు తెలియదు. ప్రొడక్షన్ హౌస్ మారుతుంది .. మిగతా టీమ్ అంతా అదే ఉంటుంది. ప్లానింగ్ మార్చుకోవలసిన అవసరం లేదు అని నానిగారు చెప్పారు. నానీని ఎంతగానో అభిమానించే వెంకట్ బోయనపల్లి గారు ముందుకు రావడంతో, ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్లడం జరిగింది. ఈ సినిమా ఓటీటీకి వెళుతుందనే టెన్షన్ ఎప్పుడూ లేదు. ఎందుకంటే "ఏడాది ఆగినా సరే ఈ సినిమాను థియేటర్లలోనే రిలీజ్ చేస్తాను .. నా మొదటి సినిమా నాకు చాలా ఇంపార్టెంట్" అని వెంకట్ బోయనపల్లిగారు ముందుగానే చెప్పారు.

కలకత్తా షెడ్యూల్ ను మేము పూర్తిచేసుకుని వచ్చిన తరువాత లాక్ డౌన్ పడింది. లేదంటే చాలా ఇబ్బందిపడేవాళ్లం.  ఎందుకంటే ఈ కథకి అక్కడి షెడ్యూల్ చాలా ప్రధానమైనది. సత్యదేవ్ జంగా గారు నాకు మూల కథ వినిపించినప్పుడు నాకు చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది. కథ 70వ దశకానికి చెందినది కావడం .. బెంగాల్ నేపథ్యంలో నడవడం .. హీరో రైటర్ కావడం ఇవన్నీ కూడా నాకు బాగా నచ్చాయి. అందువల్లనే అప్పటి నుంచి ఆ కథపై కసరత్తు చేస్తూ వెళ్లాను. మేము పడిన కష్టానికి తగిన ఫలితం దక్కడం ఆనందంగా ఉంది. నెక్స్ట్ మూవీ టైమ్ ట్రావెల్ పై చేయాలనుకుంటున్నాను. కథ రెడీ అయింది .. ప్రస్తుతం స్క్రీన్ ప్లే వర్క్ జరుగుతోంది" అని చెప్పుకొచ్చాడు. 
Tags:    

Similar News