పెళ్లి చూపులు హీరోతో.. పెళ్లిచూపులు దర్శకుడితో

Update: 2016-10-09 13:30 GMT
రాజ్ కందుకూరి అనే నిర్మాత ఐదారేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఆయన గురించి జనాలకు బాగా తెలుస్తోంది ఇప్పుడే. ‘పెళ్లిచూపులు’ లాంటి చిన్న సినిమాకు అండగా నిలిచి తన అభిరుచిని చాటుకున్న రాజ్.. ఈ సినిమాతో పేరుకు పేరు.. డబ్బుకు డబ్బు రెండూ సంపాదించాడు. ఈ సినిమా తర్వాత రాజ్ నుంచి వచ్చే సినిమా కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆయన ప్లాన్స్ కొంచెం భారీగానే ఉన్నాయి. పెళ్లిచూపులు హీరో.. దర్శకుడు ఇద్దరితోనూ వేర్వేరుగా సినిమాలు చేయడంతో పాటు.. ఒక స్టార్ హీరోతో తన స్వీయ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయబోతున్నట్లు రాజ్ ప్రకటించాడు.

‘‘పెళ్లిచూపులు సినిమా రూ.20 కోట్ల దాకా షేర్ వసూలు చేసింది. రీమేక్ కోసం కూడా అన్ని ఇండస్ట్రీల వాళ్లు అడిగారు. కొత్తగా మూడు సినిమాల కోసం సన్నాహాలు చేసుకుంటున్నా. పెళ్లిచూపులు దర్శకుడు.. హీరో ఇద్దరితోనూ వేర్వేరుగా సినిమాలుంటాయి. ఒక కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ విజయ్ దేవరకొండ హీరోగా సినిమా తీయబోతున్నా. అలాగే తరుణ్ భాస్కర్ దర్శకత్వంలోనూ సినిమా ఉంటుంది. అతను తీసిన షార్ట్ ఫిల్మ్ ‘సైన్మా’ టైటిల్ తోనే సినిమా చేస్తాను. నా దర్శకత్వంలో ఒక సినిమా అనుకుంటున్నాం. దాని కోసం ఒక స్టార్ హీరోతో సంప్రదింపులు జరుపుతున్నాం’’ అని రాజ్ కందుకూరి వెల్లడించాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News