ఇంతకీ రాఘవేంద్రుడు పెట్టుబడి పెట్టాడా లేదా?

Update: 2015-07-06 06:51 GMT
రాఘవేంద్రరావు సమర్పించు.. అని కనిపిస్తోంది బాహుబలి పోస్టర్‌పై. దీన్ని బట్టే 'బాహుబలి' సినిమాకు రాఘవేంద్రరావు పెట్టుబడి పెట్టాడనే అంతా అనుకుంటున్నారు. ఐతే రాజమౌళి మాత్రం రాఘవేంద్రరావు డబ్బులు పెట్టినందుకు కాకుండా.. ఆయన మీద గౌరవంతో అలా వేశామని చెబుతున్నాడు. ''ఏ శిష్యుడూ గురువు రుణం తీర్చుకోలేడు. మా గురువు గారి మీద గౌరవంతో సినిమాకు 'కె.రాఘవేంద్రరావు బి.ఎ. సమర్పించు' అని వేశాం. ఆ సినిమా ఆయనకు నచ్చితే, దాని విజయం చూసి ఆయన గర్వపడితే.. కొంతవరకూ శిష్యుడిగా ఆయన రుణం తీరిందని అనుకుంటా'' అని చెప్పాడు రాజమౌళి.

తన గురువుతో తన అనుబంధం గురించి.. ఆయన నుంచి నేర్చుకున్న విషయాల గురించి రాజమౌళి మాట్లాడుతూ.. ''నేను యాడ్స్‌ చేయడం దగ్గర్నుంచి మొదలుపెడితే.. ఆ తర్వాత శాంతి నివాసం సీరియల్‌కు పని చేయడం.. స్టూడెంట్‌ నెంబర్‌వన్‌ సినిమాకు దర్శకత్వం వహించడం.. నేను డైరెక్టర్‌గా విజయవంతమై ఈ స్థాయిలో ఉండటం.. ఇలా అన్నింటికీ మూలం, కారణం రాఘవేంద్రరావుగారే. సినిమా తీసే విషయంలో నా శైలికి, ఆయన శైలికి సంబంధం లేదు. నిజానికి నేను ఆయన దగ్గర అసిస్టెంట్‌గా కూడా పని చేయలేదు. కానీ మార్గదర్శిగా ప్రతి అడుగులోనూ నన్ను నడిపించారాయన. ఆయనతో ప్రయాణంలో నన్ను కట్టిపడేసింది సినిమా మీద ఆయనకున్న అంకితభావమే. ఒక పాట తీయాల్సి వస్తే రెండు మూడొందల సార్లు దాన్నే వింటూ ఉంటారు. మంచి ఆలోచన వచ్చేవరకు అదే ధ్యాస. అదే ప్రపంచం. ఆ లక్షణం తెలీకుండానే నాక్కూడా అబ్బింది'' అని చెప్పాడు.

Tags:    

Similar News