ఇంతకీ రాజమౌళి పారితోషకం ఎంత?

Update: 2015-04-13 09:30 GMT
శ్రీను వైట్ల పది కోట్లు తీసుకుంటాడట.. త్రివిక్రమ్‌కు కూడా అంతకు తక్కువేమీ ఇవ్వరట.. వి.వి.వినాయక్‌, పూరి జగన్నాథ్‌ కూడా ఎనిమిదంకెల పారితోషకం తీసుకునేవాళ్లేనట.. అంటూ రకరకాల వార్తలు వినిపిస్తుంటాయి. ఐతే దర్శకుడిగా వీళ్లందరికంటే గొప్ప ట్రాక్‌ రికార్డున్న రాజమౌళి ఎంత రెమ్యూనరేషన్‌ తీసుకుంటారన్నది మాత్రం ఎవరికీ అంతుబట్టదు. అసలు రాజమౌళి పారితోషకం ఇంత అని ఎప్పుడూ కూడా ఓ వార్త బయటికి వచ్చింది లేదు. మరి ఏంటి ఇక్కడ సీక్రెట్‌. ఇంతకీ రాజమౌళి తీసుకునే పారితోషకం ఎంత?

రాజమౌళి రెమ్యూనరేషన్‌ ఇంత అని చెప్పలేం. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా పారితోషకం తీసుకుని చాలా కాలమైంది. సినిమా లాభాల్లో వాటా తీసుకుంటుండటం వల్ల రాజమౌళి రెమ్యూనరేషన్‌ గురించి ఎవరికీ అవగాహన లేదు. చివరగా మగధీరకు రాజమౌళి పారితోషకం తీసుకున్నాడు. ఆ తర్వాత మర్యాద రామన్న, ఈగ సినిమాలకు లాభాల్లో వాటా తీసుకునేలా ఒప్పందం కుదిరింది. ఈ రెండు సినిమాలు కూడా భారీగానే లాభాలు తెచ్చిపెట్టాయి. ఇప్పుడిక బాహుబలి విషయంలోనూ రాజమౌళి ఇదే ఒప్పందం కింద పని చేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. 'బాహుబలి' రెండు పార్టులు కలిపి బడ్జెట్‌ 220 కోట్లని చెబుతున్న నేపథ్యంలో ఆ మొత్తాన్ని దాటి బాహుబలి ఎంత సంపాదించి పెడుతుంది, రాజమౌళికి ఎంత తెచ్చిపెడుతుంది.. అన్నది చూడాలి.

Tags:    

Similar News