సౌత్ లో 'బ్రహ్మాస్త్ర'పై రాజమౌళి రాజముద్ర!

Update: 2021-12-18 11:30 GMT
బాలీవుడ్ లో ఇతర భాషల వారు తమ సినిమాను రిలీజ్ చేయాలంటే కరణ్ జొహార్ ను కలవకుండా పనికాదనేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అలాంటి కరణ్ జొహార్ తెలుగు వెర్షన్ కి సంబంధించిన 'బ్రహ్మాస్త్ర' కోసం రాజమౌళి హెల్ప్ తీసుకోక తప్పలేదు. అంతేకాదు సౌత్ లో రాజమౌళికి గల పేరును ఆయన రాజముద్రలా ఉపయోగించుకోబోతున్నారు. రణ్ బీర్ కపూర్ - అలియా భట్ కాంబినేషన్లో 'బ్రహ్మాస్త్ర' రూపొందుతోంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి కరణ్ జొహార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. బలమైన కథాకథనాలతో .. అద్భుతమైన గ్రాఫిక్ వర్క్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

'బ్రహ్మాస్త్ర'ను హిందీతో పాటు సౌత్ లోని ఇతర భాషలలోను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా తెలుగు తెలుగు వెర్షన్ కి సంబంధించిన మోషన్ పోస్టర్ ను ఈ రోజున హైదరాబాద్ లో రిలీజ్ చేశారు. ముంబై నుంచి కరణ్ .. రణ్ బీర్ కపూర్ .. అలియా భట్ రాగా, ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రను పోషించిన నాగార్జున కూడా ఈ మోషన్ పోస్టర్ రిలీజ్ కి వచ్చారు. రాజమౌళి సమక్షంలో తెలుగు వెర్షన్ కి సంబంధించిన మోషన్ పోస్టర్ ను వదిలారు. 'బ్రహ్మాస్త్ర' సినిమా ప్రత్యేకతలను గురించి మాట్లాడిన కరణ్, ఆ తరువాత రాజమౌళి గురించి ప్రస్తావించాడు. తాను రాజమౌళి అభిమానిననే విషయాన్ని చెప్పకనే చెప్పాడు.

సింపుల్ గా అనిపించిన ఈ ఈవెంట్ ద్వారా 'బ్రహ్మాస్త్ర' సినిమాను గురించిన సమాచారాన్ని సాధ్యమైనంత ఎక్కువమందికి చేరవేయడానికి కరణ్ ప్రయత్నించాడు. ఈ సినిమాను సౌత్ లో తాను సమర్పిస్తున్నట్టుగా రాజమౌళి చెప్పారు. ఇది నిజంగా 'బ్రహ్మాస్త్ర' సినిమాకి కలిసొచ్చే విషయం. దక్షిణాదిన 'బాహుబలి' సాధ్యమైనంత ఎక్కువ మందికి రీచ్ కావడానికి కారణం కరణ్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే అలాంటి పెద్ద పెద్ద డీల్స్ చేసిన తెలివితేటలు కరణ్ సొంతం. ఇక ఇప్పుడు 'ఆర్ ఆర్ ఆర్' దక్షిణాదిన తన దండయాత్రను కొనసాగించాలంటే అక్కడ మళ్లీ కరణ్ సహకారం అవసరమే. అందువల్లనే సమర్పకుడిగా రాజమౌళి ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

రాజమౌళి ప్రతి సినిమాకి ఇది రాజమౌళి సినిమా అన్నట్టుగా ఒక రాజముద్ర ఉంటుంది. దర్శకుడిగా రాజమౌళిపై ప్రేక్షకులకు విపరీతమైన విశ్వాసం ఉంది. ఆయన సినిమా అంటే బలమైన కథాకథనాలు ఉంటాయి .. ఆకట్టుకునే పాటలు .. మనసును పట్టుకునే మాటలు ఉంటాయని వాళ్లంతా భావిస్తుంటారు. ఆయన ఏ సినిమాను గురించి చెప్పినా ఆ సినిమాల వసూళ్లు పెరుగుతూనే ఉంటాయి .. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ రాజమౌళి మాట ఒక సర్టిఫికెట్ లాంటిది. అందువల్లనే తమ సినిమా గురించి ఆయన ఒక్క మాట చెబితే చాలని చాలామంది అనుకుంటారు.

అలాంటి రాజమౌళి సమర్పిస్తున్నారంటే, 'బ్రహ్మాస్త్ర'లో ఎంత విషయం ఉండాలి అని అనుకోకుండా ఉండరు. తప్పకుండా ఆ సినిమాను చూడటానికి ఆసక్తిని కనబరుస్తారు. ఇక పబ్లిసిటీ పరంగా రాజమౌళి ప్లానింగ్ వేరే ఉంటుంది. ఆ ప్రకారం సినిమా విడుదల నాటికి ఆయన అందరినీ ఆ సినిమా థియేటర్స్ దిశగా నడిపిస్తారు. అందువలన 'బ్రహ్మాస్త్ర'కి మంచి రోజులు వచ్చేసినట్టే అనుకోవాలి. ఇక ఇతర భాషల్లోను రాజమౌళికి ఒక రేంజ్ లోనే క్రేజ్ ఉంది. అందువలన ఆయన సమర్పిస్తున్న ఈ సినిమా, సగం సక్సెస్ ను సాధించేసినట్టే అనుకోవాలి.
Tags:    

Similar News