బలవంతంగా బాహుబలిని ఆడించొద్దు-రాజమౌళి

Update: 2015-08-27 14:23 GMT
దటీజ్ రాజమౌళి! తనేంటో మరోసారి చాటి చెప్పాడు. సినిమాలో దమ్ముంటే ఆడుతుంది. రికార్డులు సాధిస్తుంది. అంతే తప్ప బలవంతంగా సినిమాను ఆడించడం సరికాదని తేల్చేశాడు రాజమౌళి. కొందరు హీరోల అభిమానులు ప్రతిష్టకు పోయి సినిమాల్ని థియేటర్లలో బలవంతంగా ఆడించడం చూస్తుంటాం. ఎగ్జిబిటర్ల మీద కూడా ఒత్తిడి తేవడం మామూలే. ఐతే బాహుబలి విషయంలో ఇలాంటి వ్యవహారాలు అస్సలు వద్దంటూ రాజమౌళి ట్విట్టర్ లో పెద్ద సందేశం పెట్టాడు. కొన్నిచోట్ల బాహుబలిని బలవంతంగా థియేటర్లలో కొనసాగించడానికి అభిమానులు చేస్తున్న ప్రయత్నాన్ని ఆయన తప్పుబట్టాడు. ఇలాంటి ఫాల్స్ రికార్డులు మనకొద్దు అని తేల్చిచెప్పాడు. జక్కన్న ఏమన్నాడో చూడండి.

‘‘50 రోజులు, 100 రోజులు, 175 రోజుల రికార్డులనేవి గతం. ఈ రోజుల్లో ఒక్కో సినిమా వెయ్యి థియేటర్లలో విడుదలై 3-4 వారాలు ఆడుతోంది. కొన్ని ప్రధాన స్క్రీన్లలో ఇంకా షేర్ వస్తోంది. కానీ చాలా వరకు బాహుబలి పరుగు ముగిసింది. ఇలాంటి స్థితిలో కొందరు అభిమానులు బాహుబలి ప్రదర్శన ఇంకా కొనసాగించాలని కోరడం బాధాకరం. కొందరు అభిమానులు తమ జేబుల నుంచి డబ్బులు పెడుతున్నారు. ఇంకొందరు ఎగ్జిబిటర్ల పై ఒత్తడి తెస్తున్నారు. మిత్రులారా.. అబద్ధపు రికార్డుల ద్వారా ఏం సాధిస్తాం? ప్రేక్షకులకు మనకు మరపురాని విజయాన్నందించారు. మన జీవితాంతం ఈ విజయాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా మనకేం కావాలి?  బలవంతంగా సినిమాల్ని ఆడించాల్సిన సమస్యతో ఇండస్ట్రీ చాన్నాళ్ల నుంచి బాధపడుతోంది. మనం అందులో భాగం కావద్దు. ఇలాంటి సంస్కృతికి తెరదించాలి. బాహుబలి షేర్ రాబట్టగలిగినన్నాళ్లు థియేటర్లలో ఆడుతుంది. మిగతా వాటికి దారి ఇవ్వాల్సిందే. అబద్ధపు రికార్డుల కోసం థియేటర్లను బ్లాక్ చేయడం సరికాదు’’ అని జక్కన్న అన్నాడు.

Tags:    

Similar News