ఏడేళ్ల కుర్రాడ్ని..ఇక‌పై సొంత కొడుక‌న్న ర‌జ‌నీ

Update: 2018-07-16 05:59 GMT
ఏడేళ్ల పసిప్రాయంలోనూ ఆక‌ర్ష‌ణ‌ల‌కు లొంగ‌క‌... త‌న‌కు దొరికిన బ్యాగ్‌ను టీచ‌ర్ కు అంద‌జేసి అంద‌రి మ‌న‌సుల్ని దోచేసిన ఏడేళ్ల మ‌హ్మ‌ద్ యాసిన్ ఉదంతం తెలిసిందే. ఈరోడ్ కి చెందిన ఈ కుర్రాడ్ని ఉద్దేశించి త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీ కాంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. నిజాయితీగా వ్య‌వ‌హ‌రించి అంద‌రితోనూ శ‌భాష్ అనిపించుకుంటున్న యాసీన్.. ఇక‌పై త‌న సొంత కొడుకంటూ ర‌జ‌నీ వ్యాఖ్యానించారు.

ర‌జ‌నీకాంత్‌ ను విప‌రీతంగా అభిమానించి ఆరాధించే యాసిన్.. సూప‌ర్ స్టార్ ను క‌ల‌వాల‌న్న ఆశ‌ను వ్య‌క్తం చేశారు. ఈ విష‌యం తెలుసుకున్న ర‌జ‌నీకాంత్ యాసిన్ ను క‌లుసుకోవ‌ట‌మే కాదు.. త‌న ఒళ్లో కూర్చొబెట్టుకొని ముద్దుచేశారు. ఇక‌పై త‌న సొంత కొడుక‌న్న ఆయ‌న‌.. యాసీన్ చ‌దువుక‌య్యే ఖ‌ర్చు మొత్తాన్ని తాను భ‌రిస్తాన‌ని ప్ర‌క‌టించారు.

స్కూల్ బ‌య‌ట త‌న‌కు దొరికిన సంచిన యాసిన్ త‌న టీచ‌ర్ కు అంద‌జేశారు. అందులో రూ.50వేల మొత్తం ఉన్న‌ప్ప‌టికీ.. చిన్నారి మాత్రం అవేమీ ప‌ట్టించుకోకుండా టీచ‌ర్ కు అప్ప‌గించారు. త‌ద‌నంత‌రం ఆ బ్యాగ్‌ను పోలీసుల‌కు అంద‌జేయ‌టంతో యాసిన్ ఉదంతం తెర మీద‌కు వ‌చ్చింది.

పిల్లాడి నిజాయితీకి పోలీసులు ఫిదా కావ‌ట‌మే కాదు.. అత‌డికి న‌గ‌దు పుర‌స్కారాన్ని ప్ర‌క‌టించారు.ఈ సంద‌ర్భంగా త‌న‌కు సూప‌ర్ స్టార్ ర‌జ‌నీ అంటే ఇష్ట‌మ‌ని.. ఆయ‌న్ను క‌లుసుకోవాల‌న్న మాట‌ను చెప్పారు. దీనికి స్పందించిన ర‌జ‌నీ వెంట‌నే చిన్నారిని క‌ల‌వ‌ట‌మే కాదు..ఇక‌పై త‌న కొడుకుగా ప్ర‌క‌టించేశారు.  


Tags:    

Similar News