నిరీక్ష‌ణ ఫ‌లించింది.. క‌బాలి జులై 22న‌

Update: 2016-07-11 16:47 GMT
అవును.. నిరీక్ష‌ణ ఫ‌లించింది. కోట్ల‌మంది అడుగుతున్న ప్ర‌శ్న‌కు జ‌వాబు దొరికింది. సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ కొత్త సినిమా క‌బాలి విడుద‌ల తేదీ గుట్టు వీడిపోయింది. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ కొన్ని రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతున్న‌ట్లే జులై 22న విడుద‌ల కాబోతోంది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా క‌బాలి నిర్మాత క‌లైపులి థానునే ప్ర‌క‌టించాడు. క‌బాలి విడుద‌ల తేదీ విష‌యంలో చాన్నాళ్లుగా ర‌క‌ర‌కాల ప్ర‌చారాలు జ‌రుగుతున్నా సైలెంటుగా ఉన్న థాను.. ఈ రోజు సెన్సార్ కార్య‌క్ర‌మాలు ముగిసిన కొంత సేప‌టికే విడుద‌ల తేదీ ప్ర‌కటించారు.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా జులై 22న క‌బాలి విడుద‌ల‌వుతుంద‌ని.. ఇంత‌కంటే త‌మ‌కు ఎగ్జైట్మెంట్ ఇచ్చే విష‌యం మ‌రొక‌టి ఉండ‌ద‌ని ఆయ‌న ట్విట్ట‌ర్లో పేర్కొన్నారు. అంత‌కుముందు క‌బాలి సెన్సార్ విశేషాల్ని కూడా ఆయ‌న అభిమానుల‌తో పంచుకున్నారు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు క్లీన్ యు స‌ర్టిఫికెట్ ఇచ్చింద‌ని.. సినిమా నిడివి 152 నిమిషాల‌ని ఆయ‌న వెల్ల‌డించారు.

పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన క‌బాలిలో ర‌జినీ స‌ర‌స‌న రాధికా ఆప్టే క‌థానాయిక‌గా న‌టించింది. సంతోష్ నారాయ‌ణ్ సంగీత ద‌ర్శ‌కుడు. సూప‌ర్ స్టార్ ఇందులో మ‌లేషియాలో త‌మిళుల కోసం పోరాడే మాఫియా డాన్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. త‌మిళం.. తెలుగు.. హిందీతో పాటు మ‌లేషియా భాష మ‌లాయ్ లోనూ ఈ సినిమా ఒకేసారి విడుద‌ల కానుంది.
Tags:    

Similar News