‘2.0’ ఏప్రిల్లోనే.. కానీ అసలు ట్విస్టు ఏంటంటే?

Update: 2017-12-03 05:05 GMT
అనుకున్నదే అయింది. శంకర్-రజినీకాంత్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న విజువల్ వండర్ ‘2.0’ జనవరి 26న విడుదల కావట్లేదు. కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లే ఏప్రిల్లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్. నిన్న రాత్రి ఈ మేరకు ‘లైకా’ అధినేత రాజు మహాలింగం అధికారిక ప్రకటన విడుదల చేశాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయని.. ఏప్రిల్లో విడుదల తేదీని అందుకునే దిశగా సాగుతున్నామని ఆయన తెలిపాడ. కాకపోతే ఏప్రిల్లో ఈ సినిమా ఎప్పుడు రిలీజవుతుందన్నది మాత్రం రాజు వెల్లడించలేదు.

‘2.0’ ఏప్రిల్లో విడుదలవుతుందన్న విషయంలో అందరికీ ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. కాకపోతే రిలీజ్ డేట్ పక్కాగా తెలిస్తే దానికి తగ్గట్లుగా మిగతా సినిమాల్ని షెడ్యూల్ చేసుకుందామని భావించారు. కానీ డేట్ ఇవ్వకుండా అందరినీ అయోమయంలోకి నెట్టారు ‘2.0’ మేకర్స్. సౌత్ నుంచి బాలీవుడ్ వరకు చాలా సినిమాలు ‘2.0’ రిలీజ్ డేట్ ఆధారంగా షెడ్యూల్ కాబోతున్నాయి. మరి రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ ఎప్పుడొస్తుందో చూడాలి. ఐతే ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ మాత్రం ఈ సినిమా ఏప్రిల్ 27న విడుదలవుతుందని ప్రకటించేశాడు. అదే నిజమైతే అదే రోజుకు ఫిక్సయిన ‘భరత్ అను నేను’.. ‘నా పేరు సూర్య’ సినిమాలకు ఫిట్టింగ్ పడినట్లే. ఆ డేట్ విషయంలో పట్టుదలగా ఉంటూ ఒకరితో ఒకరు కయ్యానికి కాలు దువ్వుతున్న మహేష్.. బన్నీ ఇక వేరే డేట్లు చూసుకోవాల్సిందే.
Tags:    

Similar News