సినిమా రివ్యూ : రాజు గారి గది

Update: 2015-10-22 12:58 GMT
చిత్రం : రాజు గారి గది

నటీనటులు : అశ్విన్ బాబు - చేతన్ చీను - ధన్య బాలకృష్ణ - ఈశాన్య - షకలక శంకర్ - ధనరాజ్ - విద్యులేఖరామన్ - పూర్ణ - పోసాని కృష్ణమురళి - సప్తగిరి - జీవా - రఘుబాబు - ప్రభాస్ శ్రీను తదితరులు.
ఛాయాగ్రహణం : ఎస్.జ్ఞానం
కూర్పు : నాగరాజ్
సంగీతం : సాయి కార్తీక్
మాటలు: సాయి మాధవ్ బుర్రా
నిర్మాత: ఓక్ ఎంటర్టైన్మెంట్స్ ప్రై. లిమిటెడ్
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం : ఓంకార్

'జీనియస్'తో క్రియేటివ్ జీనియస్ అనిపించుకోవాలన్న ఓంకార్ ఆశలు అడియాశలు అయ్యాయి. కంటెంట్, కమర్షియల్ పరంగా ఆ సినిమా పెద్ద ప్లాప్. దర్శకుడిగా ఓంకార్ అన్నయ్య కూడా. ఈసారి ఎక్కువశాతం మంది దర్శకులకు హిట్.. సూపర్ హిట్ అందించిన హారర్ కథతో, లిమిటెడ్ బడ్జెట్ లో 'రాజుగారి గది' అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎటువంటి హడావుడి లేకుండా షూటింగ్ ఫినిష్ చేశాడు. విడుదలకు ముందు 'రాజుగారి గది' అంటూ సెలబ్రిటీల వీడియోలతో సినిమాకు క్రేజ్, హైప్ తీసుకొచ్చారు. టీజర్, ట్రైలర్  కూడా బాగున్నాయి. మరి, సినిమా ఎలా ఉంది? విజయదశమికి ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు విజయం కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయా? చూద్దాం..!

కథ :

నందిగామలో ఓ మహల్ ప్రాంగణంలో 30మందికి పైగా చనిపోతారు. రాష్ట్రమంతా చర్చనీయాంశంగా మారడంతో ప్రభుత్వం మహల్ ను సీజ్ చేస్తుంది. ఛానల్ టి.ఆర్.పి. రేటింగ్ పెంచడం కోసం మాటీవీ ఈ మహల్ నేపథ్యంలో ఓ రియాలిటీ గేమ్ షో నిర్వహిస్తుంది. దెయ్యం ఉందంటూ ప్రచారం జరుగుతున్న ఈ మహల్లో ఉన్నవారికి 3 కోట్లు బహుమతి ఇస్తామని ప్రకటిస్తారు. షో పేరు "దెయ్యంతో ఏడు రోజులు.. గెలిస్తే 3కోట్లు". డాక్టర్ నందన్(చేతన్ చీను), అశ్విన్ బాబు(అశ్విన్), బాల త్రిపుర సుందరి(ధన్య బాలకృష్ణ), బార్బీ(ఈశాన్య), బుజ్జిమా(విద్యులేఖ రామన్), గుంటూరు శివుడు(ధనరాజ్), యం.వై.దానం (షకలక శంకర్) లు రాజుగారి పాడుబడ్డ కోటలో ఏడు రోజులు ఉండడానికి అంగీకరిస్తారు. కోట అంతా కెమెరాలు ఏర్పాటు చేస్తారు.  

నిజంగా రాజుగారి మహల్ లో దెయ్యం ఉందా? గతంలో మహల్ ప్రాంగణంలో ఇతరులను చంపింది ఎవరు? ఏడుగురు వ్యక్తులు కలసి మహల్ రహస్యం చేధించారా? అసలు ఎం జరిగింది? అక్కడ ఎం జరుగుతోంది? అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా చిత్రం.

కథనం - విశ్లేషణ :  

ప్రథమార్థం చూసిన తర్వాత ప్రేక్షకుడు హ్యాపీగా ఫీలవుతాడు. పెట్టిన ప్రతి రూపాయికి దర్శకుడు ఓంకార్ న్యాయం చేశాడు అనిపిస్తుంది. భయం.. వినోదం.. రెండు అనుభూతులను ప్రేక్షకులకు అందించాడు. హీరో అశ్విన్ గతం గురించి, కథ గురించి సగం చెప్పి ప్రేక్షకుడిలో కాస్త ఆసక్తి కలిగించాడు. ఇంటర్వెల్ తర్వాత అరగంట పాటు ధనరాజ్, షకలక శంకర్ సన్నివేశాలతో వినోదంతో పరుగులు పెట్టించాడు. అసలు కథ మొదలయ్యే సమయానికి దర్శకుడి తిప్పలు మొదలయ్యాయి. కథకు ముగింపు పలకడానికి ప్రసవ వేదన అనుభవించాడు. రియాలిటీ షోలలో ఎంత నిజం ఉంటుందో? 'దెయ్యంతో ఏడు రోజులు.. గెలిస్తే మూడు కోట్లు' కాన్సెప్ట్.. సినిమాలో కూడా అంతే నిజం ఉంటుంది. అసలు విషయం, కథలో మెయిన్ ట్విస్ట్ రివీల్ అయ్యే సమయంలో దర్శకుడిగా ఓంకార్ చేతులు ఎత్తేశాడు. అప్పటివరకూ ఆకాశంలో ఎక్కడో నడిపించిన సినిమాను ఒక్క సన్నివేశంతో నెల మీదకు తీసుకొచ్చాడు. తమ్ముడిని హీరో చేయడం కోసం వినోదం పెక్కబెట్టి యాక్షన్ బాట పట్టాడు. ఒక్కసారిగా ప్రేక్షకుల మదిలో ఎన్నో సందేహాలు వస్తాయి. పతాక సన్నివేశాలు నాగార్జున 'కింగ్'ను గుర్తుకు తెస్తాయి. అక్కడే లాజిక్ మిస్ అయ్యాడు. హడావుడిగా శుభం కార్డ్ వేయాలన్న తపన దర్శకుడిలో కనిపించింది. ప్రేక్షకులకు ఆసక్తికరంగా సన్నివేశాలను చెప్పలేకపోయాడు. సూపర్ హిట్.. హిట్.. కావలసిన సినిమాను మరింత కిందకు నెట్టాడు. హారర్ కామెడీ సన్నివేశాలు ప్రేక్షకుడు పెట్టిన ప్రతి రూపాయికి న్యాయం చేశాయి. ఎండింగ్ బాగోలేదు అన్నమాట తప్పిస్తే, సినిమా ఒకే. ఓసారి చూడొచ్చు.

నటీనటులు:

సినిమాలో నిజమైన హీరోలు షకలక శంకర్ - ధనరాజ్. ఇద్దరి కలయికలో సన్నివేశాలు బాగున్నాయి. భయపడుతూ.. ప్రేక్షకులను నవ్వించారు. ప్రధమార్థం అంతా సినిమాను ఇద్దరూ ముందుకు తీసుకువెళ్ళారు. ఇంటర్వెల్ తర్వాత బాత్రూం సన్నివేశంలో షకలక శంకర్.. దెయ్యాన్ని చూసిన తర్వాత లకలక అంటూ కడుపుబ్బా నవ్వించారు. గుంటూరు యాసలో ధనరాజ్ చెప్పిన డైలాగులు నవ్వించాయి. ఇద్దరూ నటనలో ఇరగదీశారు. తర్వాత హీరో సప్తగిరి, ఒక్క సన్నివేశంలో మెరుపులా వచ్చి నవ్వించాడు. విద్యులేఖరామన్ నటన, డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో నవ్వించింది. రెండు వేరియేషన్స్ వున్న పాత్రలో చేతన్ చీను నటన బాగుంది. ధన్య బాలకృష్ణ పాత్ర పరిథి తక్కువ. కానీ, ఉన్నంతలో బాగా నటించింది. ధన్య పాత్రకు తెలంగాణ యాసతో డబ్బింగ్ చెప్పించడం సూటవ్వలేదు. ఇక, కథలో హీరో.. దర్శకుడు ఓంకార్ తమ్ముడు అశ్విన్ నటన గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే.. అంత మంచిది. కథకు కీలకమైన సన్నివేశాల్లో అతని నటన తేలిపోయింది. యాక్షన్.. సెంటిమెంట్.. హారర్.. సన్నివేశం ఏదైనా అశ్విన్ డైలాగ్ డెలివరీ, నటన, బాడీ లాంగ్వేజ్ ఒకేలా ఉంటాయి. నటనలో బేసిక్స్ రాకపోవడంతో ఒకే ఎక్స్ ప్రెషన్ తో నెట్టుకొచ్చాడు. ఈశాన్య అందాల ప్రదర్శనతో అలరించింది. కళ్లు పెద్దవి కావడంతో దెయ్యం పాత్రకు పూర్ణను ఎంపిక చేశారు. ఆమెతో సహా పోసాని కృష్ణమురళిలకు సరైన పాత్రలు దక్కలేదు.   

సాంకేతికవర్గం:

బడ్జెట్ తక్కువయినా, సినిమాటోగ్రాఫర్ ఎస్.జ్ఞానం మంచి విజువల్స్ అందించాడు. సాయికార్తీక్ నేపథ్య సంగీతం బాగుంది. భయపెట్టడంలో నేపథ్య సంగీతం కీలక పాత్ర పోషించింది. పాటలు సినిమా చూస్తున్నప్పుడు పర్వాలేదు. కానీ, ఒక్కటి కూడా గుర్తుండదు.  పాడుబడ్డ రాజుగారి కోటను తీర్చిదిద్దిన సాహి సురేష్ ఆర్ట్ వర్క్ బాగుంది. సాయిమాధవ్ బుర్రా సంభాషణలు అర్ధవంతంగా ఉన్నాయి. ప్రాసల కోసం ప్రయాస పడలేదు. విషయం ఏంటో చెప్పారు. మధ్యలో అవయవదానం గురించి, చావు బ్రతుకుల గురించి కొన్ని నీతి వాఖ్యలు కూడా చెప్పారు(ప్రేక్షకులకు ఎంత వరకూ బుర్రకు ఎక్కుతాయో). గ్రాఫిక్స్ బాగోలేదు. హారర్ సన్నివేశాల్లో ఎడిటింగ్ బాగా కుదిరింది. పతాక సన్నివేశాల్లో కాస్త కత్తిరిస్తే బాగుండేది.  

చివరగా : ఓంకార్ అన్నయ్య వినోదం బాగుంది.

రేటింగ్ : 2.75/5

#RajugariGadi, #Rajugarigadimovie, #RajugarigadiReview, #RajugariGadiMovieReview,
#Rajugarigaditalk, #Rajugarigadirating


Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre
Tags:    

Similar News