నిజంగా చరణ్ అంత చేశాడా?

Update: 2018-03-30 04:57 GMT
రామ్ చరణ్ కెరీర్లో ‘మగధీర’ తర్వాత ఆ స్థాయిలో హైప్ తెచ్చుకున్న సినిమా అంటే ‘రంగస్థలం’ అనే చెప్పాలి. ఈ చిత్రంపై ముందు నుంచి పాజిటివ్ బజ్ ఉంది. అది విడుదల సమయానికి మరింత పెరిగింది. ‘మగధీర’ సినిమా బాగా ఆడొచ్చన్న అంచనాలు ముందు నుంచి ఉన్నాయి కానీ.. చరణ్ పెర్ఫామెన్స్ విషయంలో అంత అంచనాల్లేవు. ఎందుకంటే అప్పటికి చరణ్ అనుభవం ఒక్క సినిమా మాత్రమే. ఐతే చరణ్ విషయంలో ఏ అంచనాల్లేకుండా ‘మగధీర’ చూసిన వాళ్లు ఫిదా అయిపోయారు. అతడిపై ప్రశంసలు కురిపించారు. ఆ తర్వాత చేసిన ‘ఆరెంజ్’లో బాగానే చేసినా.. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో చరణ్ నటన గురించి పెద్దగా చర్చ జరగలేదు. ఆపై చరణ్ చేసినవన్నీ చాలా వరకు రొడ్డకొట్టుడు మాస్ సినిమాలే. దీంతో చరణ్ నటన గురించి చర్చే లేకపోయింది. నిజానికి ఆ సినిమాలు నటుడిగా చరణ్ మీద నెగెటివిటీని పెంచాయి.

ఐతే ‘ధృవ’తో ఆ నెగెటివిటీని కొంత మేర తగ్గించుకున్నాడు చరణ్. ఇప్పుడు ‘రంగస్థలం’ పూర్తిగా నెగెటివిటీని చెరిపేసి.. చరణ్ కు నటుడిగా గొప్ప పేరు తెచ్చి పెడుతుందన్న అభిప్రాయాలు అందరూ వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా గురించి తెలిసిన వాళ్లు చరణ్ కు ఇదొక మైలురాయి లాంటి సినిమా అంటున్నారు. అల్లు అరవింద్ అయితే.. ‘మగధీర’లో కన్నా చరణ్ ఇందులోనే గొప్పగా చేశాడని కితాబిచ్చేశాడు. ‘రంగస్థలం’ టీజర్.. ట్రైలర్ చూస్తే చరణ్ చిట్టిబాబు పాత్రను చాలా బాగానే చేసినట్లు కనిపించింది. ఐతే టీజర్.. ట్రైలర్లలో బెస్ట్ షాట్స్ ఎంచుకుంటారు కాబట్టి.. ఒక అంచనాకు వచ్చేయలేం. మొత్తంగా సినిమాలో చరణ్ ఎలా మెప్పించాడో చూడాలి. తనతో సినిమా చేసే ప్రతి హీరోనూ నటుడిగా ఒక మెట్టు ఎక్కిస్తుంటాడు సుకుమార్. చరణ్ ను మాత్రం చాలా మెట్లే ఎక్కించాడన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి నిజంగా ‘రంగస్థలం’తో చరణ్ గ్రేట్ పెర్పామర్ అనిపించుకుంటాడో లేదో చూద్దాం.
Tags:    

Similar News