`వైర‌స్` ను వ‌ద‌ల‌బోతోన్న వ‌ర్మ‌!

Update: 2018-06-10 10:54 GMT
వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌ - అక్కినేని నాగార్జునల కాంబోలో తెర‌కెక్కిన `ఆఫీస‌ర్` డిజాస్ట‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే. త‌మ కాంబోలో రాబోతోన్న మ‌రో `శివ‌`అంటూ వ‌ర్మ ఊద‌ర‌గొట్టినా....ఆ సినిమా ప్లాప్ అయింది. దీంతో, కొంత‌కాలం పాటు వ‌ర్మ సినిమాల‌కు దూరంగా ఉంటూ.....వెబ్ సిరీస్ లు చేసుకుంటాడేమోన‌ని అంతా భావించారు. వ‌ర్మ చ‌ర్య‌లు ఊహాతీతం...అన్న ట్రోల్ కు జ‌స్టిఫికేష‌న్ చేస్తూ...వ‌ర్మ త‌న త‌ర్వాతి సినిమాను ప్ర‌క‌టించాడు. ఓ స‌రికొత్త `వైర‌స్` ను జ‌నాల మీద‌కు వ‌దిలేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు వ‌ర్మ త‌న ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్ట్ చేశాడు. ఆ సినిమాకు సంబంధించిన ప్రెస్ నోట్ ను షేర్ చేశాడు. గతంలో వర్మతో సర్కార్‌ - ఎటాక్స్ ఆఫ్ 26/11 చిత్రాలను తెరకెక్కించిన పరాగ్‌ సంఘ్వీ నిర్మాణంలో `వైర‌స్` తెర‌కెక్క‌నుండ‌డం విశేషం. వ‌ర్మ‌తో తీయ‌బోతోన్న `వైర‌స్` కు సంబంధించిన ఓ ప్రెస్ నోట్ ను ప‌రాగ్ కూడా విడుద‌ల చేశారు. వ‌ర్మ చెప్పిన క‌థ త‌న‌కు బాగా న‌చ్చింద‌ని - అందుకే ఈ ప్రాజెక్టుకు ఓకే చెప్పాన‌ని ప‌రాగ్ అన్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన కొన్ని వివ‌రాల‌ను వ‌ర్మ త‌న ప్రెస్ నోట్ లో వెల్ల‌డించారు.

``ముంబైకు చెందిన ఓ విద్యార్థి సెంట్రల్‌ ఆఫ్రికా ప‌ర్య‌ట‌నకు వెళ్లి అరుదైన వైరస్‌ బారిన పడతాడు. ఆ విద్యార్ధి ముంబైకి తిరిగి వచ్చిన తరువాత ఇబోలా క‌న్నా భ‌యంక‌ర‌మైన ఆ వైర‌స్ ఆ మ‌హాన‌గ‌రంలో వ్యాప్తి చెందుతుంది. 2 కోట్ల జ‌నాభా ఉన్న ముంబైలో ఆ వైర‌స్ అంద‌రికీ వ్యాప్తి చెంద‌కుండా ప్ర‌భుత్వం ఓ వినూత్న నిబంధ‌న పెడుతుంది. ఒక మ‌నిషికి మ‌రో మ‌నిషికి మ‌ధ్య క‌నీసం 20 అడుగుల దూరం పాటించాల‌నే నిబంధ‌న‌ను విధిస్తుంది. అంత భారీ సంఖ్య‌లో జ‌నాభా ఉన్న ముంబై న‌గరానికి అది సాధ్యం కాదు. దీంతో, అప్ప‌టికే ఆ వైర‌స్ వ్యాప్తి చెంది దాదాపు ల‌క్ష‌మంది మ‌ర‌ణిస్తారు. దీంతో, దేశంలోని మిగ‌తా ప్రాంతాల‌కు ఆ వైర‌స్ వ్యాప్తి చెంద‌కుండా ముంబై విడిచి ఎవ‌రూ వెళ్ల‌కూడ‌ద‌నే మ‌రో నిబంధ‌న‌ను ప్ర‌భుత్వం విధిస్తుంది. అయితే, వైర‌స్ బారిన ప‌డ్డ వారెవ‌రో స్ప‌ష్ట‌త లేక‌పోవ‌డంతో...అక్ర‌మంగా ముంబై విడిచి వెళ్లాల‌ని చూసేవారిని కాల్చిప‌డేయాల‌ని అధికారుల‌ను స‌ర్కార్ ఆదేశిస్తుంది. మిగ‌తా ప్ర‌పంచంతో సంబంధాలు తెగిపోవ‌డంతో భ‌య‌భ్రాంతుల‌కు గురైన ముంబై ప్ర‌జ‌లకు.....ఆ వైర‌స్ ను ముంబైకే ప‌రిమితం చేసి...దానిని అంతం చేయాల‌న్న సంక‌ల్పంతో ఉన్న అధికారుల‌కు మ‌ధ్య జ‌రిగే ప‌రిణామాల‌తో ఈ `వైర‌స్` తెర‌కెక్క‌నుంది.``అని వ‌ర్మ ప్రెస్ నోట్ ను త‌న ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. మ‌రి, ఈ వెరైటీ కాన్సెప్ట్ వ‌ర్మ‌కు స‌క్సెస్ ఇస్తుందో లేదో వేచి చూడాలి.

Tags:    

Similar News