జూనియర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ జనతా గ్యారేజ్. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా.. ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రీసెంట్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా జనతా గ్యారేజ్ లో యంగ్ టైగర్ ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు.
జనతా గ్యారేజ్ కి సంబంధించి లోగో డిజైన్ అదిరిపోయిందనే టాక్ వచ్చింది. టైటిల్ కింద రాసిన క్యాప్షన్ అందరినీ ఆకట్టుకుంది. 'ఇక్కడ అన్ని రిపేర్లు చేయబడును' అని రాసి ఉంటుంది టైటిల్ కింద. ఈ కేప్షన్ మారాలంటూ ఎనర్జిటిక్ హీరో రామ్ ఓ ట్వీట్ చేశాడు. అలాగని ఈ కేప్షన్ నచ్చలేదని కాదు.. రిలీజ్ తర్వాత రికార్డులు బద్దలవ్వాలనే సెన్స్ తో తన కోరిక బయటపెట్టాడు ఈ హీరో.
ఎన్టీఆర్ బర్త్ డే విషెస్ చెబుతూ హీరో రామ్ పెట్టిన ట్వీట్ ఇది. "జనతా గ్యారేజ్ కేప్షన్ 'ఇచ్చట అన్ని రికార్డులు సెట్ చేయబడును'కి రిలీజ్ తర్వాత మారాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్ డే ఎన్టీఆర్ " అని ట్వీట్ చేశాడు రామ్. ఇప్పటివరకూ తను చేసిన రెండు సినిమాలతోను.. ప్రభాస్, మహేష్ లకు కెరీర్ బెస్ట్ మూవీ ఇచ్చిన కొరటాల శివ.. తమ అభిమాన హీరోకి కూడా ఆ ఫీట్ ఇచ్చి.. హ్యాట్రిక్ సాధించాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.