ప్ర‌ఖ్యాత ఫిలింస్టూడియో క‌నుమ‌రుగు

Update: 2020-02-17 09:26 GMT
మద్రాస్ నుంచి సినీప‌రిశ్ర‌మ హైద‌రాబాద్ లో స్థిర‌ప‌డిన క్ర‌మంలోనే రామానాయుడు స్టూడియోస్.. అన్న‌పూర్ణ స్టూడియోస్.. సార‌థి స్టూడియోస్.. రామ‌కృష్ణ స్టూడియోస్ ప్రారంభ‌మ‌య్యాయి. వీటిలో మెజారిటీ భాగం సినిమా షూటింగ్ లు జ‌రిగేవి. అలానే ల్యాబ్ కి సంబంధించి రికార్డింగ్ డ‌బ్బింగ్ స్టూడియోలు స‌హా స‌క‌ల సౌక‌ర్యాలు అందుబాటులో ఉండేవి. డా.డి.రామానాయుడు సార‌థ్యంలోని రామానాయుడు స్టూడియోస్ ప్రాముఖ్య‌త గురించి తెలిసిందే. ఈ స్టూడియోతో పాటు రామానాయుడు జ‌మానాలోనే సురేష్ బాబు బృందం నాన‌క్ రామ్ గూడ ప‌రిస‌రాల్లో కొన్ని ఎక‌రాల్లో స్టూడియోని నిర్వ‌హించింది.

నాన‌క్ రామ్ గూడ రామానాయుడు స్టూడియోస్ గా ప‌రిశ్ర‌మ‌లో పాపుల‌రైంది. అయితే ఇది ప్ర‌యివేట్ స్టూడియో మాత్ర‌మే. హైద‌రాబాద్ ఔట‌ర్ రింగ్ రోడ్ ప‌రిస‌రాల్లో ఉన్న ఈ స్టూడియోలో నిరంత‌రం షూటింగులు జ‌రుగుతుంటాయి. అయితే ఇది ఇకపై క‌నుమ‌రుగు కానుంద‌ని తెలుస్తోంది. ద‌శాబ్ధాల పాటు ఇక్క‌డ వంద‌లాది చిత్రాలు తెర‌కెక్కాయి. కానీ ఇక‌పై ఈ స్టూడియో అందుబాటులో ఉండ‌ద‌ని తెలుస్తోంది. ఇక్క‌డ  స్టూడియో స్థానంలో రియ‌ల్ వెంచ‌ర్ ప్ర‌త్య‌క్షం కానుంద‌ని తెలుస్తోంది.

ప్ర‌ఖ్యాత స్థిరాస్తి వ్యాపార సంస్థ మీనాక్షి క‌న్ స్ట్ర‌క్ష‌న్స్ కి ఈ స్టూడియో స్థ‌లాన్ని డెవ‌ల‌ప్ మెంట్ కి ఇచ్చేశార‌ని.. ఇక్క‌డ ఆకాశ‌హార్మ్యాల్ని త‌ల‌పించే భారీ భ‌వంతులతో గేటెడ్ క‌మ్యూనిటీ కాల‌నీ ఏర్పాటు కానుంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే అందుకు సంబంధించిన ఒప్పందం పూర్త‌యింద‌ట‌. త్వ‌ర‌లోనే భ‌వ‌న‌ నిర్మాణం ప్రారంభం కానుంద‌ని తెలుస్తోంది. ఇటీవల హైదరాబాద్ ఔటర్ లో రియ‌ల్ బూమ్ ఓ రేంజులో ఉంది. ఇక ఔట‌ర్ ప‌రిస‌రాల్లోనే భారీగా ఐటీ కంపెనీలు ఉండ‌డంతో ఇక్క‌డ వెంచ‌ర్లు హాట్ కేక్ లుగా మారాయి. ఆ క్ర‌మంలోనే కొన్ని ఎక‌రాల్లో ఉన్న ఈ స్టూడియోస్ ప‌రిస‌రాల్లో వంద‌ల కోట్లలో బిజినెస్ సాగ‌నుంద‌ని ప్ర‌చార‌మ‌వుతోంది.


Tags:    

Similar News