ఇది చాలు డాడీ నా జీవితానికి: చరణ్ ఎమోషన్

Update: 2022-04-24 06:30 GMT
ఇంతవరకూ చిరంజీవి సినిమాల్లో చరణ్ అలా వచ్చి ఇలా మాయం కావడం, చరణ్ సినిమాల్లో చిరంజీవి గెస్టుగా మెరవడం జరుగుతూ వచ్చింది. ఫస్టు టైమ్ ఈ ఇద్దరూ కలిసి 'ఆచార్య' సినిమాలో ఎక్కువ సేపు కనిపించనున్నారు. ఈ నెల 29వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతుండటంతో, ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ లో చరణ్ మాట్లాడుతూ .. "నాన్నగారితో కలిసి ఈ సినిమాను ఎంతో ఎంజాయ్ చేస్తూ చేశాను. అందుకు మీ అందరి సహకారం ఉంది.

ఈ సినిమా కోసం నేను మారేడుమిల్లిలో మా నాన్నగారితో కలిసి 20 రోజులు ఉన్నాను. ఈ 20 రోజుల్లో నేను ఆయన దగ్గర నేర్చుకున్న దానితో పోల్చుకుంటే, ఈ 20 ఏళ్లలో నేర్చుకున్నది నథింగ్ అనిపిస్తుంది. అలాంటి అవకాశం నాకు ఇచ్చిన కొరటాల శివగారికి థ్యాంక్స్ చెబుతున్నాను. 'బొమ్మరిల్లు' సినిమాలో తండ్రి చేతిలోనే సిద్ధూ చేయి ఉన్నట్టుగా, రాజమౌళి గారి సెట్లోకి అడుగుపెడితే ఆ యాక్టర్ చేయి ఆయన చేతిలోనే ఉంటుంది.

మా నాన్నగారి రిక్వెస్ట్ వలన .. ఇది మా అమ్మగారి డ్రీమ్ ప్రాజెక్టు అని తెలిసిన తరువాత ఆయన నన్ను 'ఆచార్య' సెట్లోకి పంపించారు. అందుకు మా అందరి తరఫున ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కొరటాల శివతో చేయాలని చాలా కాలంగా అనుకున్నాను. మా నాన్నగారితో కలిసి ఆయన దర్శకత్వంలో చేయాలని రాసిపెట్టుందనే విషయం ఆ తరువాత అర్థమైంది. కథలో దమ్ముంటే యాక్టర్స్ ఓవరాక్షన్ చేయవలసిన పనిలేదు. కోరటాల మాటల్లోనే ఒక ఫైట్ ఉంటుంది .. ఆ మాటల్లోనే  ఒక పవర్ ఉంటుంది.

'ఆర్ ఆర్ ఆర్' మాదిరిగానే 'ఆచార్య'ను కూడా నేను ఎంతో ఇష్టపడి చేశాను. అందువలన నాకు పెద్ద కష్టంగా అనిపించలేదు. ఆ సినిమాలానే ఇది కూడా విజయాన్ని సాధిస్తుందని నేను భావిస్తున్నాను. పూజ హెగ్డేతో  'రంగస్థలం'లో ఒక పాట చేసినప్పుడు, మళ్లీ ఆమెతో  చేసే ఛాన్స్  ఎప్పుడు వస్తుందా అనుకున్నాను.

ఆ అవకాశం ఇంత తొందరగా వస్తుందని అనుకోలేదు. స్కూల్లో ఉన్న మా ఆచార్యులకు దూరంగా ఉన్నప్పటికీ, ఇంట్లో ఉన్న మా ఆచార్య నాకు బాగా నేర్పించారు. అయితే దగ్గర కూర్చోబెట్టుకుని ఒక పాఠంలా ఆయన ఎప్పుడూ చెప్పలేదు. ఈ సినిమాలో ఆయనతో కలిసి నటించే ఛాన్స్ .. సరదాగా గడిపే ఛాన్స్ నాకు వచ్చింది .. మళ్లీ ఎప్పుడు వస్తుందో తెలియదు .. ఇది చాలు నా జీవితానికి"  అంటూ చరణ్ ఎమోషనల్ అయ్యాడు.
Tags:    

Similar News