అప్పుడు తండ్రితో.. ఇప్పుడు కొడుకుతో

Update: 2018-08-09 01:30 GMT
కథానాయికగా కెరీర్ ముగిశాక క్యారెక్టర్ రోల్స్ లోకి మారిన వాళ్లు ఏదో నామమాత్రంగా బండి నడిపిస్తుంటారు కానీ.. వాళ్లు అప్పుడు కూడా స్టార్ స్టేటస్ అనుభవించడం.. క్రేజ్ తెచ్చుకోవడం అన్నది అరుదుగా జరుగుతుంటుంది. ఈ అరుదైన తారల జాబితాలో రమ్యకృష్ణను చేర్చవచ్చు. ‘బాహుబలి’లో శివగామి పాత్రతో ఆమె తెచ్చుకున్న గుర్తింపు అంతా ఇంతా కాదు. దేశవ్యాప్తంగా ఆమె పేరు మార్మోగిపోయింది. ఈ సినిమా తర్వాత రమ్యకృష్ణ రేంజే మారిపోయింది. ఆమె పారితోషకం భారీగా పెరిగింది. దక్షిణాదిన లేడీ క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో రమ్యకృష్ణ స్థాయి ఇప్పుడు మరెవరికీ లేదు. ఆమె కోసం రచయితలు.. దర్శకులు ప్రత్యేకమైన పాత్రల్ని తయారు చేస్తున్నారు. ఆమె డేట్ల కోసం నిర్మాతలు ఎగబడుతున్నారు. మారుతి దర్శకత్వంలో రాబోతున్న ‘శైలజా రెడ్డి అల్లుడు’ చిత్రంలో శైలజా రెడ్డి రమ్యకృష్ణే అన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కోటికి పైనా పారితోషకం తీసుకుందట రమ్య.

తాజాగా తెలుగులో ఆమె మరో క్రేజీ ప్రాజెక్టును ఓకే చేసిందట. ‘ఫిదా’.. ‘తొలి ప్రేమ’ సినిమాలతో సూపర్ హిట్లు కొట్టిన యువ కథానాయకుడు వరుణ్ తేజ్ కొత్త చిత్రంలో రమ్య కీలక పాత్ర పోషించనుందట. ‘అప్పట్లో ఒకడుండేవాడు’తో మంచి గుర్తింపు సంపాదించిన సాగర్ చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. 14 రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని పెద్ద బడ్జెట్లోనే నిర్మించనుంది. ఇందులో కథానాయిక ఇంకా ఖరారవ్వలేదు. హీరోయిన్ కంటే ముందు రమ్యను ఖాయం చేశారు. ఇందులోనూ ఆమె పాత్ర ప్రత్యేకంగానే ఉంటుందని అంటున్నారు. రమ్య ఇంతకముందు వరుణ్ తండ్రి నాగబాబు సరసన ‘కౌరవుడు’ అనే సినిమా చేయడం విశేషం. ఇప్పుడు నాగబాబు కొడుకు సినిమాలో ఆమె ఎలాంటి క్యారెక్టర్ చేస్తుందో చూడాలి. దీంతో పాటుగా రమ్య చేతిలో దాదాపు అరడజను సినిమాలున్నట్లు సమాచారం.
Tags:    

Similar News